ప్రమాదంలో తండ్రీకొడుకుల దుర్మరణం
సిద్దిపేటరూరల్: అతివేగంగా కారు నడిపి కల్వర్టును ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని ఇర్కోడ్ వద్ద ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన అక్కగారి సాయి భార్యాపిల్లలతో కలిసి దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో సాయంత్రం సిద్దిపేటలో పని ఉందని చెప్పిన సాయి తన కొడుకుతో కలిసి కారులో వస్తున్నాడు. ఇర్కోడ్ గ్రామ శివారు వద్దకు రాగానే సాయి అతివేఽగంగా అజాగ్రత్తతో కారును నడిపి కల్వర్టును ఢీకొట్టాడు. దీంతో కారులో ఉన్న సాయి(26)తో పాటు కుమారుడు హర్షవర్ధన్(5) అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాలను సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.


