ఆయిల్‌పామ్‌తో ఆదాయం | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పామ్‌తో ఆదాయం

Jun 28 2026 7:24 AM | Updated on Jun 28 2026 7:24 AM

గెలలు కోతకు వస్తుండటంతో

రైతుల్లో ఉత్సాహం

టన్నుకు రూ.23,500 చెల్లింపు

జిల్లాలో 3,500 ఎకరాల్లో సాగు

జహీరాబాద్‌ టౌన్‌: జిల్లాలో సాగు చేసిన ఆయిల్‌పామ్‌ పంట చేతికి వస్తుంది. గెలలు కోతకు వస్తుండటంతో రైతుల్లో ఉత్సాహం కనిపిస్తుంది. దీంతో పంట వేయని అన్నదాతలు ఆయిల్‌పామ్‌ సాగు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం కూడా భారీగా రాయితీలు ఇస్తుండడంతో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఇతర పంటలతో పొల్చి తే రైతులకు తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమతో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆయిల్‌పామ్‌ మొక్కలను ఒక్కసారి నాటితే 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుంది. నాటిన నాలుగో సంవత్సరం నుంచి పంట చేతికి వస్తుంది.

మరో 3,500 ఎకరాల్లో సాగు లక్ష్యం

ప్రస్తుతం జిల్లాలో 3,500 ఎకరాల్లో పంట సాగవుతుంది. మరో 3వేల ఎకరాలు టార్గెట్‌ కాగా 450 ఎకరాల్లో ప్లాంటేషన్‌ చేశారు. ఽమూడు సంవత్సరాల క్రితం 500 ఎకరాల్లో సాగు చేసిన తోటల్లో ప్రస్తుతం గెలలు కోతకు వస్తున్నాయి. సెప్టెంబర్‌ నుంచి కోయడానికి గెలలు సిద్ధంగా ఉన్నాయి. జహీరాబాద్‌ నియోజవకర్గంలోని జహీరాబాద్‌, మొగుడంపల్లి, న్యాల్‌కల్‌ మండలాల్లో అధిక విస్తీర్ణంలో ఆయిల్‌పామ్‌ తోటలు సాగవుతున్నాయి. గోద్రేజ్‌ కంపెనీ.. గెలల కొనుగోలుకు చర్యలు తీసుకుంటోంది. జహీరాబాద్‌ మండలంలోని గోవింద్‌పూర్‌ వద్ద కలెక్షన్‌ సెంటర్‌, న్యాల్‌కల్‌ మండలంలోని గంగ్వార్‌ వద్ద పంట సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆయిల్‌పామ్‌ గెలలకు మంచిఽ ధర పలుకుతుంది. ప్రస్తుతం టన్నుకు రూ.23.500 ధర పలుకుతుంది. తొలిపంట ఎకరానికి 4 టన్నుల వరకు గెలలు ఉత్పత్తి అవుతాయని ఉద్యానశాఖ అధికారి పండరి తెలిపారు. చెట్ల వయసు పెరుగుతున్న కొద్ది సుమారు 10 టన్ను ల గెలలు ఉత్పత్తి అవుతుందని చెప్పారు. నెలకు రెండు సార్లు సంవత్సరానికి 24 సార్లు గెలలు కోసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. సంవత్సరానికి లక్ష నుంచి రెండు లక్షల వరకు ఆదాయం పొందవచ్చన్నారు. 150 నుంచి 160 రోజుల్లో పంట చేతికి వస్తుందని, ఆసక్తి గల రైతులు పంట సాగుకు ముందుకు రావాలని సూచించారు.

హద్నూర్‌లో కోతకు వచ్చిన

ఆయిల్‌పామ్‌ పంట

సాగుకు రాయితీ

వట్‌పల్లి(అందోల్‌): రైతుల ఆర్థికాభివృద్ధికి ఆయిల్‌పామ్‌ సాగు దోహదపడుతుందని జిల్లా ఉద్యానవనశాఖ అధికారి పి.సోమేశ్వరరావు అన్నారు. శనివారం అందోల్‌ మండల పరిధిలోని డాకూర్‌ గ్రామంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్‌ పామ్‌ మెగా ప్లాంటేషన్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయిల్‌ పామ్‌ సాగుతో రైతులకు దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. 2026–27 సంవత్సరానికి జిల్లాలో 3వేల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించగా, ఆ దిశగా రైతులకు అవగాహన కల్పించి మొక్కలు నాటుతున్నామని తెలిపారు. సాగుచేసే రైతులకు ప్రభుత్వం రాయితీ కల్పిస్తోందన్నారు.

జిల్లా ఉద్యానవన శాఖ

అధికారి సోమేశ్వరరావు

ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం

ఆయిల్‌ పామ్‌ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. గొటిగార్‌పల్లి గ్రామంలో మూడేళ్ల క్రితం 12 ఎకరాల్లో పంట సాగు చేశారు. గెలలు కోతకు వస్తున్నాయి. క్రాప్‌ చాలా బాగుంది. సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు కటింగ్‌ చేస్తాం. ఎకరానికి సుమారు రూ. 7 వేల ఖర్చు అయింది. ప్రభుత్వం నిర్వహణ ఖర్చుల కోసం ఎకరానికి రూ.4.200 నాలుగు సంవత్సరాల వరకు ఇస్తుంది. ఎకరానికి రూ. 50 వేల డ్రిప్‌ సౌకర్యం కల్పించింది. – చల్ల నాగేశ్వర్‌రెడ్డి, రైతు, రంజోల్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement