పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన | - | Sakshi
Sakshi News home page

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Jun 28 2026 7:24 AM | Updated on Jun 28 2026 7:24 AM

సంగారెడ్డి: సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వం పాఠశాల, కళాశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించే లక్ష్యంతో టీజీఐఐసీ నుంచి కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద రూ.5.40 కోట్లు అందాయి. నిధులతో ఉమెన్స్‌ డిగ్రీ కాలేజీలో రూ.4కోట్లు వెచ్చించి హాస్టల్‌ నిర్మించనున్నారు. రూ.75 లక్షలతో బాలికల జూనియర్‌ కాలేజీలో ఆడిటోరియం నిర్మాణం చేపట్టనున్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో డైనింగ్‌ హాల్‌, కిచెన్‌ నిర్మాణం కోసం రూ.75 లక్షలు వెచ్చించనున్నారు. తారా డిగ్రీ కళాశాలలో ప్రహరీ నిర్మాణం కోసం ఇందులో నుంచి రూ.50లక్షలు కేటాయించారు. ఈ పనులకు టీజీఐఐసీ చైర్‌ పర్సన్‌ నిర్మలారెడ్డి శనివారం శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్‌, సంగారెడ్డి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ కూన వనిత, బ్లాక్‌ ప్రెసిడెంట్‌ జార్జ్‌, కాంగ్రెస్‌ పార్టీ సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు కిరణ్‌గౌడ్‌, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

ఓటరు ప్రక్రియను

సద్వినియోగం చేసుకోండి

ఫుడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఫహీం

నారాయణఖేడ్‌: స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) ప్రక్రియను ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఫుడ్‌ కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌, టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఖేడ్‌ నియోజకవర్గ సర్‌ ఇన్‌చార్జి ఫహీం సూచించారు. ఖేడ్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. ప్రతీ అర్హుడైన ఓటరును జాబితాలో చేర్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సర్‌ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. 2004 తర్వాత జన్మించి ఇప్పటివరకు నమోదు కానివారు, 18 సంవత్సరాలు పైబడిన వారు తమ తల్లిదండ్రుల గుర్తింపుతోపాటు విద్యార్హత ధ్రువపత్రం, లేదా 12 రకాల ధ్రువపత్రాలలో ఏదో ఒక ధ్రువపత్రంతో నమోదు చేసుకుంటే మూడవ కేటగిరీలో నమోదవుతారని చెప్పారు. ప్రస్తుతం ఓట్‌ చోరీ జరుగుతున్నందున సర్‌ పట్ల ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండి తమ వివరాలతో దరఖాస్తులు అందించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌్‌ దారం శంకర్‌, కాంగ్రెస్‌ నాయకులు వినోద్‌పాటిల్‌, సుబుర్‌ ఉన్నారు.

పాఠశాలలో మౌలిక వసతులు

అదనపు కలెక్టర్‌ పాండుకు బీఆర్‌ఎస్‌వీ వినతి

సంగారెడ్డి: ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని శనివారం హెల్పింగ్‌ హ్యాండ్స్‌ యూత్‌ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్‌ పాండుకు బీఆర్‌ఎస్‌వీ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అఖిల్‌ మాట్లాడుతూ... ఈనెల 15వ తేదీ నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైనందున జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులైన మంచినీటి సదుపాయం, టాయిలెట్ల నిర్మాణం, పాఠశాలకు ప్రహరీగోడ వంటివి ఏర్పాట్లు చేయాలని కోరారు. అదేవిధంగా శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను గుర్తించి మరమ్మతులు చేయించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల కుదింపును ఆపాలని కోరారు. కార్యక్రమంలో సభ్యులు రఘు, సాయి తదితరులు పాల్గొన్నారు.

ప్రజాభిప్రాయం మేరకే

రోడ్డు విస్తరణ పనులు

నారాయణఖేడ్‌: ఖేడ్‌ పట్టణంలో ప్రజల అభిప్రాయానికి అనుగుణంగానే రోడ్డు విస్తరణ చేపట్టాలని ఖేడ్‌ పట్టణ ఏఐఎంఐఎం అధ్యక్షుడు, న్యాయవాది మొహిద్‌పటేల్‌ డిమాండ్‌ చేశారు. శనివారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రోడ్డు విస్తరణతో నష్టపోయే బాధితులు పరిష్కారం కోసం ఎంపీ, ఎమ్మెల్యేను ఆశ్రయిస్తే సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఒకరిపై ఒకరు బాధ్యతలను నెట్టుకుంటున్నారన్నారు. ఏళ్ల తరబడి బైపాస్‌ రోడ్లను నిర్లక్ష్యం చేసిన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఇప్పుడు రోడ్డుకు ఇరువైపులా 50 అడుగుల మేర విస్తరణ పేరిట ప్రజల్లో తీవ్ర భయాందోళనలు సృష్టిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. బైపాస్‌ రోడ్లను అభివృద్ధిచేసి 161బీ జాతీయ రహదారి విస్తరణ పూర్తిచేస్తే పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య గణనీయంగా తగ్గుతుందన్నారు. ఈ అంశాలన్నీ త్వరలోనే తమ పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ దృష్టికి తీసుకెళ్తానని వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement