వేలాదిగా తరలి వచ్చిన ప్రజలు
ఆకట్టుకున్న నృత్యాలు
న్యాల్‌కల్(జహీరాబాద్): మండల పరిధిలోని టేకూర్ గ్రామంలో మొహర్రం సందర్భంగా నిర్వహించే పీర్ల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యా యి. శనివారం వివిధ ప్రాంతాల నుంచి దూదిపీర్లతో ప్రజలు వేలాదిగా తరలి వచ్చి మైబుసుభాని దర్గాను దర్శించుకుని అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం గుట్ట సమీపంలో గల నబీసాబ్ సమాధిని కూడా దర్శించుకున్నారు. నృత్యాలు చేస్తూ గ్రామ ప్రధాన కూడలి వద్దకు చేరుకుని అక్కడ ఆశుర్‌ఖానా వద్ద ఉంచిన దూదిపీర్లను ప్రజలు కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలోని ప్రధాన వీధులు ప్రజలతో కిటకిటలాడాయి. ప్రధాన కూడలి వద్ద ప్రజలు ఆడిన రుమాళ్లట ఎంతగానో ఆకట్టుకుంది. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలకు గ్రామస్తులు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు భాస్కర్‌రెడ్డి దర్గాను దర్శించుకుని దట్టీలు సమర్పించారు. ఆయన వెంట న్యాల్‌కల్ పీఏసీఎస్ చైర్మెన్ సిద్దిలింగయ్యస్వామి, సర్పంచ్‌లు శ్రీనివాస్‌రెడ్డి, అశ్విన్ పాటిల్, రమేశ్, సుధాకర్‌తోపాటు నాయకులు నగేష్, కాశీనాథ్ తదితరులున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హద్నూర్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.


