విస్తరణ పేరిట కూల్చివేతలు! | - | Sakshi
Sakshi News home page

విస్తరణ పేరిట కూల్చివేతలు!

Jun 27 2026 7:30 AM | Updated on Jun 27 2026 7:30 AM

ఇళ్లకు నోటీసులు అంటిస్తున్న మున్సిపల్‌ సిబ్బంది వ్యాపారులు, స్థానికుల్లో ఆందోళన

నారాయణఖేడ్‌: నిజాంపేట్‌ 161 జాతీయ రహదారి అనుసంధానంగా నారాయణఖేడ్‌ మీదుగా బీదర్‌కు 161బీ పేర జాతీయ రహదారి నిర్మాణం జరుగుతోంది. ఖేడ్‌ పట్టణం పొలిమేర నుంచి ఈ జాతీయ రహదారిని నిర్మిస్తున్నారు. కాగా ఖేడ్‌ పట్టణంలో ఉన్న పాత రహదారిని సైతం ఇరువైపులా 50 అడుగులు విస్తరిస్తామంటూ మున్సిపల్‌ కమిషనర్‌ పేరిట నోటీసులు జారీ చేశారు. మున్సిపల్‌ సిబ్బంది పలు నివాసాలకు ఇప్పటికే నోటీసులను అతికించారు. వారంలోగా ఇళ్లను కూల్చుకోవాలని, లేని పక్షంలో తామే కూల్చి ఆ ఖర్చులను వాటి యజమానుల నుంచి వసూలు చేస్తామంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో వ్యాపారులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

నోటీసు అస్పష్టం!

జాతీయ రహదారుల అధికారుల ఆదేశాల మేరకు రోడ్డుకిరువైపులా 50 అడుగుల మేర ఉన్న నివాసాలు, ఆక్రమణలు వారంలోపు తొలగించుకోవాలని, లేని పక్షంలో తామే కూల్చి ఆ ఖర్చు ఇంటి యజమానులపై వేస్తామని పేర్కొన్నారు. మంగల్‌పేట్‌ భవానీ ఆలయం సమీపం నుంచి నూతన బస్టాండ్‌ వరకు ఉన్న నివాసాలు దాదాపు 100 నుంచి 200 ఏళ్ల క్రితం నిర్మించినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. అప్పట్లో పంచాయతీరాజ్‌ శాఖ రోడ్డు కూడా లేని సమయంలో ఉన్న బండ్ల బాటను క్రమేపీ రోడ్డుగా ఏర్పాటు చేసి పంచాయతీరాజ్‌, ఆర్‌ అండ్‌ బీ రోడ్డుగా మార్చారు. అప్పటి పురాతన నివాసాలు ఎలా ఆక్రమణలు అవుతాయని, ఇళ్లుకు నాటి నుంచి ఇంటి నంబర్లు, విద్యుత్‌, నల్లా కనెక్షన్లు ఉండి, పన్నులు వసూలు చేస్తూంటే అవి ఆక్రమణలు ఎలా అవుతాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నేషనల్‌ హైవే అధికారుల ఆదేశాలు అంటూ పేర్కొన్న నోటీసులో నేషనల్‌ హైవే అధికారుల లేఖ నంబరు కానీ, లేఖ ప్రతి కానీ అందించక పోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పరిహారం లేకుండా కూల్చివేతలా!!

జాతీయ రహదారి శాఖ రోడ్డును విస్తరిస్తే నివాసాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించి నష్ట పరిహారం అందించి విస్తరణ చేపడతారు. కానీ మున్సిపల్‌ అధికారులు ఆక్రమణలు అంటూ నోటీసులో పేర్కొనడం అనుమానాలకు తావిస్తోంది. మంగల్‌పేట్‌ నుంచి రాజీవ్‌చౌక్‌ మీదుగా మనూరు క్రాస్‌రోడ్డు వరకు విస్తరిస్తే పట్టణంలో సుమారు 340కి పైగా వ్యాపార సముదాయాలు, నివాసాలు కూల్చివేతకు గురవుతాయి. రూ.కోట్లాది విలువగల ఆస్తులు ధ్వంసం అవుతాయి. జరిగే ఆస్తుల నష్టాలకు పరిహారం అందించి రోడ్డు విస్తరణలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. కానీ అధికారులు ఆ దిశగా ఎలాంటి ప్రకటన చేయడం లేదు.

బాధితులకు పరిహారమివ్వాలి

మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

నారాయణఖేడ్‌: ఖేడ్‌ పట్టణంలో ఇళ్ల కూల్చివేతతో నష్టపోతున్న బాధితులకు నష్ట పరిహారం అందించిన అనంతరం విస్తరణ చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రోడ్డు విస్తరణతో నష్టపోతున్న బాధితులు ఆయనతో సమావేశమయ్యారు. అనంతరం భూపాల్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ...బీఆర్‌ఎస్‌ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉండగా ప్రజలకు నష్టం జరగకుండా వారి అభీష్టం మేరకు రోడ్డుకిరువైపులా 35 ఫీట్ల మేర విస్తరించాలని నిర్ణయించానని, అంతలో ఎన్నికలు రావడంతో నిలిచిపోయిందన్నారు. కానీ నేడు 50 ఫీట్ల విస్తరణ పేరిట వందల ఏళ్లనాటి నివాసాలు ఆక్రమణలు అంటూ నోటీసులు జారీ చేయడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పరిహారంపై అధికారులు, నాయకులు స్పష్టత ఇచ్చి బాధితులను ఆదుకున్న తర్వాతే రోడ్డును విస్తరించాలని కోరారు. ఇళ్లు కోల్పోయే వారికి నష్టం కలిగిస్తే బాధితుల పక్షాన పోరాడటానికి తాను సిద్ధంగా ఉన్నాని స్పష్టం చేశారు. బాధితులను ఆదుకోవడంతోపాటు రోడ్డును 35 అడుగుల మేరకే విస్తరించాలని సబ్‌ కలెక్టర్‌ ఉమాహారతిని కోరినట్లు వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement