ఇంతి.. సోలార్‌ కాంతి | - | Sakshi
Sakshi News home page

ఇంతి.. సోలార్‌ కాంతి

Jun 27 2026 7:30 AM | Updated on Jun 27 2026 7:30 AM

నల్లవల్లి, అవుదాత్‌పూర్‌లలో సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటు!

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పెట్రోల్‌ బంక్‌..ఆర్టీసీ బస్సులకు యజమానులైన స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలు ఇకపై సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు కూడా కానున్నారు. జిల్లాలో రెండు గ్రామ మహిళా సమాఖ్య (వీఓ)లకు రెండు సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు మంజూరయ్యాయి. గుమ్మడిదల మండలం నల్లవల్లి వీఓతో పాటు, నాగల్‌గిద్ద మండలం అవుదాత్‌పూర్‌ వీఓల ఆధ్వర్యంలో ఈ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో ప్లాంటు సామర్థ్యం ఒక మెగావాట్‌. ఈ సోలార్‌ ప్లాంట్ల ద్వారా వచ్చే స్థిరమైన ఆదాయం ఆయా వీఓల్లో సభ్యులుగా ఉన్న ఎస్‌హెచ్‌జీ మహిళలకే అందుతుంది. అలాగే ఈ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలు కూడా స్థానిక ఎస్‌హెచ్‌జీ మహిళలే తీసుకుంటారు. దీంతో వారికి స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

పీఎం కుసుమ్‌ పథకం ద్వారా..

సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసే వారికి కేంద్ర ప్రభుత్వం పీఎం కుసుమ్‌ పథకం కింద పెద్ద మొత్తంలో సబ్సిడీలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఈ సోలార్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రాల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ నిర్దేశించిన రేటుతో విద్యుత్‌శాఖ కొనుగోలు చేస్తుంది. ఈ మేరకు విద్యుత్‌ శాఖతో 25 ఏళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఒక్కో ప్లాంటు ఏర్పాటు ఖర్చు రూ.మూడు కోట్లుగా అంచనా వేశారు. ఇందులో పది శాతం అంటే రూ.30 లక్షలు ఆయా గ్రామ మహిళా సంఘాలు చెల్లించాలి. మిగిలిన 90% రూ.2.70 కోట్లు బ్యాంకు రుణంగా మంజూరు చేస్తుంది. మహిళా సంఘాలు చెల్లించాల్సిన రూ.30 లక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షలను గ్రాంటు రూపంలో మంజూరు చేసింది. రెండు వీఓలకు కలిపి రూ.40 లక్షలు మంజూరయ్యాయి. మిగిలిన రూ.10లక్షల చొప్పున వీఓలు చెల్లిస్తున్నాయి. వీటిలో ఉత్పత్తి అయిన విద్యుత్‌ను విక్రయించడం ద్వారా దాదాపు ఐదేళ్లలోనే ఆయా వీఓలకు పెట్టిన పెట్టుబడి మొత్తం వస్తుందని అధికారులు చెబుతున్నారు.

ఒక్కో ప్లాంటు సామర్థ్యం ఒక మెగావాట్‌

రూ.మూడు కోట్ల వ్యయంతో ఏర్పాటు

ఇప్పటికే వీటికి నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు

ఈ రెండు గ్రామాల్లో నాలుగు ఎకరాల సర్కారు భూమిని ప్రభుత్వమే వీఓలకు కేటాయించింది. ఈ భూముల్లో ప్లాంటు ఏర్పాటుకు అవసరమైన ఫిజిబిలిటీ నివేదిక కూడా వచ్చింది. ఈ ప్లాంట్ల నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వం ఓ ఏజెన్సీకి అప్పగించింది. ఇప్పటికే ఈ ప్లాంటు ఏర్పాటు పనులు ప్రారంభం కావాల్సి ఉండగా, అనివార్యకారణాలతో ఆ ఏజెన్సీ పనులు ప్రారంభించలేదని తెలిసింది. దీంతో మరో ఏజెన్సీకి ఈ బాధ్యతలు అప్పగించారు. మరో రెండు నెలల్లో ఈ ఏజెన్సీ విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు పనులను ప్రారంభించనుందని అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement