రైతు భరోసాకు కొత్తవారు దరఖాస్తు చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

రైతు భరోసాకు కొత్తవారు దరఖాస్తు చేసుకోవాలి

Jun 27 2026 7:30 AM | Updated on Jun 27 2026 7:30 AM

రైతు భరోసాకు కొత్తవారు దరఖాస్తు చేసుకోవాలి న్యాయం జరిగే వరకు పోరాడతాం విద్యార్థులతో చెలగాటమాడొద్దు హోటళ్లలో ఆహార ధరలు తగ్గించాలి

తుది గడువు జూలై 5

జహీరాబాద్‌: కొత్తగా పట్టాదారు పుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. జూన్‌ 15వ తేదీ వరకు కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన వారు మాత్రమే ఇందుకు అర్హులని పేర్కొ న్నారు. అర్హులైన రైతులు తమ పరిధిలోని వ్యవ సాయ విస్తరణ అధికారి లేదా మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని వివరించారు. దరఖాస్తుతో పా టు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌ మొదటి పేజీ జిరాక్స్‌ కాపీలను రైతు భరోసా దరఖాస్తు ఫారం జత చేయాలని సూచించారు. దరఖాస్తు చేసుకునేందుకు జూలై 5వ తేదీ చివరి గడువని పేర్కొన్నారు.

నారాయణఖేడ్‌: తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకూ తెలంగాణ రాష్ట్ర సేనపార్టీ పోరాటం కొనసాగిస్తుందని ఆ పార్టీ ఉమ్మడి మెదక్‌ జిల్లా సమన్వయకర్త భవానీశంకర్‌, ఖేడ్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి బాపు మల్‌శెట్టి తెలిపారు. జూలై 2న హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో నిర్వహించనున్న తెలంగాణ ఉద్యమకారుల భూ పోరాట బహిరంగ సభకు సంబంధించి శుక్రవారం ఖేడ్‌లో సన్నాహక సమావేశం నిర్వహించి వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ... కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో ఉద్యమకారులు కాంగ్రెస్‌ పార్టీకి మద్దతునిస్తే అధికారంలోకి వచ్చాక రూ.25 వేల పెన్షన్‌, 250 గజాల ఇంటిస్థలం, గుర్తింపు కార్డు, ఉచిత బస్సుపాసు ఇస్తామని హామీనిచ్చి మోసం చేసిందన్నారు. భూ పోరాట బహిరంగసభలో ఉద్యమకారులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఉద్యమకారులు సంజీవరెడ్డి, కవితమ్మ, తెలంగాణ జేఏసీ నాయకులు కిష్టయ్య, శంకర్‌యాదవ్‌, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.

బీసీ విద్యార్థి సంఘం

జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్‌గౌడ్‌

పటాన్‌చెరు టౌన్‌: విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించకుండా వారి జీవితాలతో చెలగాటమాడొద్దని బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్‌గౌడ్‌ విజ్ఞప్తి చేశారు. ఇస్నాపూర్‌ మున్సిపల్‌ పరిధిలోని రుద్రారంలో శుక్రవారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నవీన్‌గౌడ్‌ మాట్లాడుతూ... ప్రభుత్వం ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు యాజమాన్యాలు సర్టిఫికెట్‌లు ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజు బకాయలు చెల్లిస్తామని చెప్పిన సీఎం రేవంత్‌ గద్దెనెక్కిన తర్వాత రూ.10వేల కోట్ల ఫీజు బకాయిలు చెల్లించకుండా విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. జీఓ నం 8,9 వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరును నిరసిస్తూ రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య పిలుపు మేరకు ఈ నెల 30న కళాశాలల తరగతులు బహిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు పాల్గొన్నారు.

నవభారత్‌ నిర్మాణ్‌ యువసేన

వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీధర్‌

పటాన్‌చెరు టౌన్‌ః వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై కేంద్ర ప్రభుత్వం విధించిన పరిమితులను తొలగించిన నేపథ్యంలో, హోటళ్లు, రెస్టారెంట్లు గతంలో గ్యాస్‌ కొరత పేరుతో పెంచిన ఆహార ధరలను వెంటనే తగ్గించాలని నవ భారత్‌ నిర్మాణ్‌ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మెట్టు శ్రీధర్‌ డిమాండ్‌ చేశారు. పటాన్‌చెరులో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నప్పటికీ అధిక ధరలను కొనసాగించడం సమంజసం కాదన్నారు. ప్రజల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని హోటల్‌ యాజమాన్యాలు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆహార ధరలపై పర్యవేక్షణ చేపట్టి న్యాయమైన ధరలకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement