● మొహర్రం వేడుకల్లో జిల్లాలోనే ప్రథమం
● టేకూర్‌లో నేటి నుంచి రెండు రోజుల పాటు ఉత్సవాలు
న్యాల్‌కల్(జహీరాబాద్): మొహర్రం పండగ వ చ్చిందంటే టేకూర్ గ్రామంలో సందడి నెలకొంటుంది. జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు సమీపాన గల కర్ణాటక రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తారు. జిల్లాలోనే మొహర్రం వేడుకలకు టేకూర్ గ్రామం ప్రసిద్ధి. గ్రామంలో జరిగే పండుగకు దశాబ్దాల చరిత్ర ఉంది. మొహర్రం పండుగ ముగిసిన రోజు నుంచే రెండు రోజుల పాటు ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు ప్రారంభమవుతాయి. గ్రామం పక్క నే ఉన్న కొండ గుట్టపై ఉన్న దర్గాను దర్శించుకునేందుకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి దూది పీర్లతో ప్రజలు వేల సంఖ్యలో తరలి వస్తారు. కుల, మతాలతో సంబంధం లేకుండా అన్నీ వర్గాలు పాల్గొనే ఈ పండుగను మతసామరస్యానికి ప్రతీకగా చూడవచ్చు.
రెండు రోజులు ఉత్సవాలు
రెండు రోజుల పాటు గ్రామంలో జరిగే ఉత్సవాల్లో పీర్ల ముందు ఎక్కడ చూసినా డప్పుల మోత, నృత్యాలు చేయడం కనిపిస్తుంది. గ్రామం నడిబొడ్డున ప్రజలు పాటలు పాడుతూ రెండు రోజుల పాటు రుమాళ్ల ఆటతోపాటు ఇతర ఆటలు ఆడుతారు. జిల్లాలోనిలోని మాయికోడ్, ముంగి, చినిగెపల్లి, జబ్గి, ధర్మాపూర్, నాగుపల్లి, హస్నాబాద్, ధన్నారం, ఉసిర్కెపల్లి, నాగులపల్లి, మైకోడ్, ఒకరాన, కర్ణాటకలోని మైలూర్ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 28 వరకు దూదిపీర్లు గ్రామానికి వస్తాయి. వివిధ ప్రాంతాల నుంచి పీర్లతో వచ్చిన ప్రజలు గుట్టపై గల దర్గాకు వెళ్లి అక్కడ దర్శనం చేసుకుంటారు.
మహిమ గల దర్గా
టేకూర్ గ్రామం సమీపంలో గుట్టపై ఉన్న గుహలో వందల ఏళ్ల క్రితం వెలసిన మైబు సుభాని దర్గా మహిమ వల్లే ఆయా గ్రామాల నుంచి పెద్ద ఎత్తున దూది పీర్లు వస్తాయని చెబుతుంటారు. దర్గాను దర్శించుకుంటే ఏరోగాలు రావని ప్రజలు పేర్కొంటున్నారు.
నబీసాబ్ సమాధి
గుట్టపై గల మైబు సుభాని దర్గాకు వెళ్తున్న క్రమంలో కింది భాగంలో ఉండే నబీసాబ్ సమాధిని ప్రజలు తప్పకుండా దర్శించుకుంటారు. గతంలో నబీసాబ్ జీవించి ఉన్నప్పుడు పలు మహిమలు చూపేవాడని గ్రామస్తులు పేర్కొంటున్నారు. రెండు రోజులపాటు జరిగే మొహర్రం ఉత్సవాలకు గ్రామస్తులు, యువజన సంఘం సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచే ఇక్కడకు వచ్చే ప్రజలకు గ్రామస్తులు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు.


