ముమ్మరంగా ఓటరు సర్వే | - | Sakshi
Sakshi News home page

ముమ్మరంగా ఓటరు సర్వే

Jun 27 2026 7:30 AM | Updated on Jun 27 2026 7:30 AM

ఇంటింటికీ తిరిగి ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ

క్షేత్రస్థాయిలో పరిశీలించిన సబ్‌ కలెక్టర్‌ ఉమాహారతి

నారాయణఖేడ్‌: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ –2026లో భాగంగా డివిజన్‌ పరిధిలో రెండవ రోజు శుక్రవారం శ్రీహౌజ్‌ టు హౌజ్‌శ్రీ సర్వే మ్యాపింగ్‌, ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగింది. పట్టణంలో సబ్‌ కలెక్టర్‌ ఉమాహారతి, తహసీల్దార్‌ రాజు పటేల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రశాంతితో కలిసి 169, 176 పోలింగ్‌ బూత్‌ల పరిధిలో స్వయంగా పర్యటించారు. ఈ మేరకు సర్వే మ్యాపింగ్‌, ఎన్యూమరేషన్‌ ఫారాలను అందజేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బూత్‌ స్థాయి అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం ఓటర్ల సందేహాలను కూడా నివృత్తి చేశారు.

మునిపల్లిలో ఫారాల పంపిణీ

మునిపల్లి (అందోల్‌): మండలంలోని ఖమ్మంపల్లిలో బీఎల్‌ఓలు ఇంటింటికీ తిరిగి ఎన్యూమరేషన్‌ ఫారాలను అందజేశారు. మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు మీనాక్షి సాయికుమార్‌ ఆధ్వర్యంలో పలువురు గ్రామస్తులకు ఈ ఫారాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది శశాంక్‌ తదితరులు పాల్గొన్నారు.

బీఎల్‌ఓలదే కీలక పాత్ర

ఓటర్ల నమోదు ప్రక్రియలో బీఎల్‌ఓలే అత్యంత కీలకమని తహసీల్దార్‌ రాంగోపాల్‌ రావు అన్నారు. శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో బీఎల్‌ఓలు, అంగన్‌వాడీ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ఓటరు స్లిప్పులు, ఎన్యూమరేషన్‌ ఫారాలను అందజేస్తున్నట్లు తెలిపారు. 2002 నుంచి 2025 వరకు ఓటర్ల జాబితాలో ఇప్పటికే పేర్లు ఉన్నవారు, ఓటరు ఆధారాల కోసం ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు చూపించాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాపింగ్‌లో కొత్తగా ధ్రువపత్రాలు సమర్పించాల్సిన వారు.. కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్న 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుందన్నారు. పాత ఓటర్ల జాబితాతో పోల్చి చూసి.. చనిపోయిన, డూప్లికేట్‌, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను తొలగిస్తారు. ప్రస్తుతం స్థానికంగా నివసిస్తున్న అర్హుల పేర్లను యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఎన్యూమరేషన్‌ ఫారం సమర్పించినప్పుడు ఓటర్లు తప్పకుండా రశీదు తీసుకోవాలన్నారు. ఇంటికి తాళం వేసి ఉంటే బీఎల్‌ఓలు మూడు సార్లు ఆ ఇంటిని సందర్శిస్తారన్నారు. ఒకవేళ డ్రాఫ్ట్‌ జాబితాలో పేరు లేకపోతే ఫారం–6 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలన్నారు. కొత్త ఓటర్ల నుంచి ఫారం–6తో పాటు డిక్లరేషన్‌ ఫారం కూడా స్వీకరిస్తారన్నారు. అలాగే ఓటర్లు స్వయంగా భారత ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఎన్యూమరేషన్‌ ఫారం నింపి సమర్పించే అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement