నారాయణఖేడ్: పట్టణ శివారులోని చక్రసహిత లలితాంబికాదేవి ఆలయంలో ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఆలయ వ్యవస్థాపకులు శ్రీపంతులు ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు రెండు రోజులపాటు నిర్వహించనున్నారు. ఈ మేరకు రుద్రచండీయాగం, కుంభాభిషేక మహోత్సవాలు నిర్వహించారు. శనివారం నవచండీ పారాయణం, రుద్రహోమం, చండీహోమం, సామూహిక కుంకుమార్చనలు, లలిత సహస్రనామ పారాయణం నిర్వహించనున్నారు. అలాగే పట్టణంలోని దత్తాత్రేయస్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
పరామర్శ
జహీరాబాద్ టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో టిక్కెట్ ఆశించి భంగపడిన పలువురు బీఆర్‌ఎస్ నాయకులను కౌన్సిలర్ స్రవంతి పరామర్శించారు. పట్టణంలోని శాంతినగర్‌లోని తులసీదాస్ గుప్త, ఆర్.సుభాష్‌ల ఇళ్లకు వెళ్లి పలకరించారు. ఉద్యమకారులకు పార్టీ అండగా ఉంటుందని, కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని ధైర్యం ఇచ్చారు. ఈ సందర్భంగా వారిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నామ రవికిరణ్, నరేష్‌రెడ్డి ఉన్నారు.
రోడ్డు పనులు ప్రారంభం
నారాయణఖేడ్: మండలంలోని తుర్కపల్లి నుంచి పోతన్‌పల్లి(ఆర్), పలుగు తండాల మీదుగా సిర్గాపూర్ మండలంలోని కడ్పల్ వరకు రూ.2.77 కోట్లతో నిర్మిస్తున్న రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులకు శుక్రవారం తుర్కపల్లి, పోతన్‌పల్లి(ఆర్) గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు ప్రతాప్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి పూజ చేశారు. ఈ రోడ్డుతో ఖేడ్, సిర్గాపూర్ మండలాలకు రవాణా సదుపాయంతో పాటు అనేక గ్రామాల వారికి దూరభారం తగ్గుతుందని తెలిపారు. అనంతరం నిధులు మంజూరు చేయించిన ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ దత్తుగౌడ్, ఉప సర్పంచ్‌లు, వార్డుసభ్యులు పాల్గొన్నారు.
200 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్
పటాన్‌చెరు టౌన్: స్థానిక డివిజన్‌లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ప్రణీత్ ప్రణవ్ నైట్ వుడ్స్ విల్లా కమ్యూనిటీ నివాసితులు, రోటరీ క్లబ్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ శిబిరంలో 200 మందికిపైగా పాల్గొని క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు. ఈ శిబిరంలో ఈశ్వర్, మురళీ కృష్ణ, ఉదయ్, ప్రదీప్, పెద్దిరెడ్డి, ప్రభాకర్, రాజేష్, హరి, ధనిష్ట, పవన్, దీపక్ తదితరులు పాల్గొన్నారు.
రైతు భరోసాకు
దరఖాస్తు చేసుకోవాలి
నర్సాపూర్: కొత్తగా పట్టాదార్ పాసు పుస్తకం పొందిన రైతులు ప్రభుత్వం అందించే రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి దీపిక రైతులకు సూచించారు. గతేడాది నుంచి ఈనెల 15వరకు కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం పొందిన రైతులు రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.


