● ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
● రూ.1.51 కోట్లతో మూడు పార్కుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
పటాన్‌చెరు: పార్కులు ప్రజల ఆరోగ్యానికి, భవిష్యత్తు తరాల ఆనందానికి చిరునామాగా నిలుస్తాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ కాలనీ, హెచ్‌ఎంటీ శిల్ప లేఔట్ కాలనీ, పీఎన్‌ఆర్ కాలనీలలో రూ. ఒక కోటి 51 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పార్కుల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని తొమ్మిది డివిజన్‌లలో ఉన్న ప్రతి పార్కు అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. పార్కుల అభివృద్ధి ద్వారా ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు పచ్చదనం పెరిగి, కాలనీలలో స్వచ్ఛమైన గాలి లభిస్తుందన్నారు. కాలనీవాసుల సౌకర్యార్థం ప్రతి పార్కులో పిల్లల కోసం ఆట వస్తువులు, పెద్దల కోసం వాకింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహాగౌడ్, డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, ఇంజనీరింగ్ విభాగం సురేష్, డీఈ వెంకటరమణ, పార్కుల విభాగం మేనేజర్ సతీష్, మాజీ కౌన్సిలర్లు ఉపేందర్ రెడ్డి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.


