జహీరాబాద్ టౌన్: పట్టణంలో ఎప్పుడూ రద్దీగా ఉండే అల్గోల్ రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. దశాబ్దాల క్రితం వేసిన ఈ రోడ్డుకు నేటికీ మరమ్మతులు చేపట్టకపోవడంతో రోడ్డు పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారింది. ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షానికే గుంతల్లో నీరు చేరడంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. రోడ్డుపై గుంతలు ఎక్కడ ఉన్నాయో తెలియక నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు వెంట నిరంతరం భారీ వాహనాలు, కాంక్రిట్ మిక్సింగ్ వాహనాలు మితిమీరిన లోడ్‌తో తిరగడంతో రోడ్డు పూర్తిగా ధ్వంసమై పెద్ద పెద్ద గుంతలు పడుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. అయితే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు మూడు నెలల క్రితమే రోడ్డెక్కి నిరసన చేపట్టారు. సర్పంచ్ చల్ల శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో కూడా నిర్వహించారు. అంతేకాదు కలెక్టర్ ప్రావీణ్యను స్వయంగా కలిసి వినతిపత్రం అందజేశారు. అయినా నేటికీ అధికారులు, పాలకులు రోడ్డు మరమ్మతులను పట్టించుకునే వారు కరువయ్యారు. అధికారులు ఇప్పటికై నా స్పందించి దెబ్బతిన్న అల్గోల్ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలన్నారు. లేనిపక్షంలో గ్రామస్తులను సమీకరించి పట్టణంలో పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని సర్పంచ్ చల్ల శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు.
● అధ్వానంగా అల్గోల్ రోడ్డు
● వాహనదారులకు నిత్యం నరకం


