జహీరాబాద్: విద్యార్థులు చెడు అలవాట్లను దరిచేరనీయవద్దని, మంచి మార్గంలో నడిచి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అదనపు జూనియర్ సివిల్ జడ్జి బ్లెస్సి సూచించారు. శుక్రవారం పట్టణంలోని నవచేతన్య కళాశాలలో మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో నడుచుకోవాలని, పెద్దలపై గౌరవంగా ఉండాలన్నారు. విద్యార్థి దశ చాల కీలకమైందని, ఈ దశలో మత్తు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించారు. చెడు వ్యసనాలకు అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందన్నారు. అనంతరం మాదక ద్రవ్యాల నిరోధక చట్టం, బాల కార్మిక నిర్మూలన చట్టం, బాల్య వివాహ నిరోధక చట్టం, ఉచిత న్యాయ సేవా సహాయంపై విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, న్యాయవాదులు గోపాల్, విశ్వనా పాల్గొన్నారు.


