కాలుష్య నియంత్రణ బోర్డు పర్యావరణ ఇంజనీర్ విజయలక్ష్మి
పటాన్‌చెరు టౌన్: పారిశ్రామికవాడలో కాలుష్యాన్ని తగ్గించి పచ్చదనాన్ని పెంపొందించాలని కాలుష్య నియంత్రణ బోర్డు పర్యావరణ ఇంజనీర్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలోని న్యూలాండ్ లాబోరేటరీస్ లిమిటెడ్, యూనిట్–2 పరిశ్రమలో గురువారం నిర్వహించిన ప్రపంచ డీ కార్బనైజేషన్ దినోత్సవంలో విజయలక్ష్మి హాజరై మాట్లాడారు. పరిశ్రమలు కార్బన్ ఉద్గారాల తగ్గింపు, పునరుత్పాదక ఇంధన వినియోగం, ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ, హరిత సాంకేతికతల ప్రోత్సాహంలో కీలకపాత్ర పోషించాలని సూచించారు. అనంతరం అధికారులు, ఉద్యోగులతో కలిసి ప్రతిజ్ఞ చేయించి, గ్రీన్ ర్యాలీ నిర్వహించారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు సంస్థ కట్టుబాటును చాటారు. కార్యక్రమంలో సంస్థ సీనియర్ అధికారులు మహేశ్‌జోషి, అనిల్ కుమార్, రామకృష్ణ, రఘునాథ్, మురళీ, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్ టౌన్: మండలంలోని దిడ్గి గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటైంది. ఈ మేరకు నూతన సంఘానికి సంబంధించి జిల్లా మత్స్యశాఖ అధికారి పూర్ణిమ గురువారం ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. అధ్యక్షులుగా పండరి, డైరెక్టర్లుగా జి.సోము, బి.గోపాల్, రాజు, జె.అశోక్, జి.శ్రీనివాస్, బి.నాగేందర్, ఏ.కృష్ణ, యూ.రాజు నియమితులయ్యారు. ఈ సందర్భంగా డీఎఫ్‌ఓ పూర్ణిమ మాట్లాడుతూ..ఇక నుంచి గ్రామంలోని నీటి వనరులపై సంఘానికే హక్కులుంటాయన్నారు. గ్రామ పరిధిలోని చెరువులు, కుంటలు చేపల పెంపకానికి దోహదపడతాయని, దీంతో ఉపాధి లభిస్తుందని చెప్పారు.
నూతన ఎస్టీఓతో టీపీటీఎఫ్ నాయకులు
పటాన్‌చెరు టౌన్: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పదవీ విరమణ పొందిన వారికి సంబంధించిన పెండింగ్ బిల్లులను త్వరితగతిన పరిష్కరించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) నాయకులు విజ్ఞప్తి చేశారు. జిల్లా ట్రెజరీ కార్యాలయం నుంచి పటాన్‌చెరు సబ్ ట్రెజరీ కార్యాలయానికి బదిలీపై వచ్చిన ఎస్టీఓ రాజిరెడ్డిని టీపీటీఎఫ్ నాయకులు గురువారం కలిసి శాలువాతో సన్మానించారు. టీపీటీఎఫ్ డైరీతోపాటు జీవోల పుస్తకాన్ని బహూకరించారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాంచందర్, రాష్ట్ర కౌన్సిలర్ సంజీవయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు నాసర్ పటేల్, మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా యంత్రాంగానికి సీఎంఓ ఆదేశాలు
జిన్నారం (పటాన్‌చెరు): గడ్డపోతారం పట్టణ పరిధిలో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని జిల్లా యంత్రాంగానికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. తాగునీటి సమస్యను క్షేత్రస్థాయిలో గుర్తించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పట్టణ పరిధిలో గత 45 రోజులుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘గడ్డపోతారంలో తాగునీటి కరువు’శీర్షికతో గురువారం ‘సాక్షి’పత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ తాన్య మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించి సమస్యపై ఆరా తీశారు.


