నూతన విద్యా విధానం రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

నూతన విద్యా విధానం రద్దు చేయాలి

Jun 26 2026 7:33 AM | Updated on Jun 26 2026 7:33 AM

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం 2020ను వెంటనే రద్దు చేయాలని టీఎస్‌ యూటీఎఫ్‌ డిమాండ్‌ చేసింది. రాష్ట్రంలో ఎలాంటి చర్చ లేకుండా నూతన విద్యా విధానాన్ని అమలుతో విద్యారంగాన్ని పూర్తిగా కేంద్రీకరించి రాష్ట్రాల ప్రత్యేక సంస్కృతిని, ఆర్థిక స్థితిగతులను రాబోయేతరాలకు తెలియనివ్వకుండా చేస్తున్నారని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి తెలిపారు. సంఘం పిలుపు మేరకు గురువారం కలెక్టరేట్‌ వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జ్ఞాన మంజరి మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించకుండా, సరిపడా ఉపాధ్యాయులను నియమించకుండా పేద పిల్లలకు విద్యను దూరం చేస్తున్నారన్నారు. విద్య కాషాయీకరణకు బాటలు వేస్తున్నారని, దేశవ్యాప్తంగా ప్రభుత్వ విద్యారంగాన్ని బలహీనపరుస్తున్న నూతన విద్యా విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్‌ మినహాయింపు ఇవ్వకుండా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అందరూ టెట్‌ పాస్‌ కావాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కుదింపు సరికాదు

రాష్ట్రంలోని 27 వేల పాఠశాలలను 4వేలకు కుదిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడం సరికాదని సంఘం నాయకులు అభిప్రాయపడ్డారు. పీఆర్సీ నివేదికను బహిర్గతం చేసి అందరికీ ఆమోదయోగ్యమైన ఫిట్మెంట్‌తో అమలు చేయాలని కోరారు. అనంతరం అదనపు కలెక్టర్‌ సంగీత, డీఆర్వో పాండుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు అశోక్‌, ఉపాధ్యక్షుడు కాశీనాథ్‌, ప్రధాన కార్యదర్శి సాయిలు, కోశాధికారి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శులు సాయి ఎ.తేజ, నరేశ్‌, సంయుద్దీన్‌, సిరాజ్‌, ప్రసన్న, ప్రశాంత్‌కుమార్‌ జిల్లా కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

టీఎస్‌యూటీఎఫ్‌ డిమాండ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement