హుస్నాబాద్‌రూరల్: గ్రామీణ విద్యార్థులు సాంకేతిక విద్యపై ఆసక్తితో అడుగులు వేస్తున్నారు. పాలిటెక్నిక్ చేయడంతో విద్యార్హతతో పాటు ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయనే నమ్మకంతో పాలిటెక్నిక్‌లో ప్రవేశం కోసం క్యూ కడుతున్నారు. హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ఈ విద్యా సంవత్సరానికి గాను కొత్తగా ఏఐ కోర్సుకు అనుమతి ఇచ్చారు. దీంతో సాంకేతిక విద్యకు డిమాండ్ పెరిగింది.
ఏఐ కోర్సుతో ఆసక్తి
హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ను 2017లో ప్రారంభించి సివిల్, ఈఈఈ కోర్సులకు ప్రభుత్వం అనుమతిచ్చింది. మొదటి తరం విద్యార్థులు మౌలిక వసతులులేక ఇబ్బందులు పడ్డారు. అధ్యాపకులు, బస్సుసౌకర్యం ఉన్నప్పటికీ విద్యార్థులు పాలిటెక్నిక్‌కు మొగ్గుచూపలేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏఐ కోర్సుకు అనుమతి ఇవ్వడంతో దూరప్రాంతాల విద్యార్థులు చేరడానికి ముందుకు వస్తున్నారు.
హాస్టల్ సౌకర్యం లేక ఇబ్బందులు
ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో బాలికలు, బాలుర వసతి గృహాలు నిర్మించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. బాలికల హాస్టల్ నిర్మిస్తే దూరప్రాంతాల నుంచి వచ్చే వారికి కష్టాలు తీరుతాయని ఆశిస్తున్నారు. కాలేజీలో కావల్సిన స్థలం ఉందని, హాస్టల్ నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.
ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో
పెరిగిన ప్రవేశాలు
కొత్త ఏఐ కోర్సుకు అనుమతి
ఉపాధి అవకాశాలపైవిద్యార్థుల ఆకర్షణ
బాలికల హాస్టల్ నిర్మించాలని విజ్ఞప్తి
ఖాళీలు ఇలా..
పాలిటెక్నిక్‌లో సివిల్ బ్రాంచిలో 66 సీట్లకు 49 మంది, ఈఈఈ (66) సీట్లకు 51 మంది, ఏఐ (66) సీట్లు 51 మంది విద్యార్థులు ప్రవేశం పొందినట్లు అధ్యాపకులు తెలిపారు. 27, 28 తేదీలలో స్లైడింగ్‌కు అవకాశం ఉంటుందని అందులో విద్యార్థుల ప్రవేశాలను బట్టి జూలై 1 తర్వాత స్పాట్ అడ్మిషన్లకు అవకాశం ఉంటుంది. పాలిటెక్నిక్‌కు అనుబంధంగా శాతవాహన ఇంజనీరింగ్ కాలేజీ ప్రారంభం కావడంతో అందులో ఇంజనీరింగ్ పూర్తిచేసే ఆలోచనతో ప్రవేశాలు పొందుతున్నామని పలువురు విద్యార్థులు తెలిపారు.


