ఒకరికి తీవ్రగాయాలు
కొమురవెల్లి(సిద్దిపేట): మండలంలోని మర్రిముచ్చాల గ్రామ శివారులో గురువారం ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివిరాలిలా ఉన్నాయి. చేర్యాల మండలం తాడూరి గ్రామానికి చెందిన పుల్లూరి సత్యనారాయణ గురువారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై మర్రిముచ్చాలకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో చేర్యాల నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో సత్యనారాయణకు తీవ్రగాయలయ్యాయి. వెంటనే స్థానికులు సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
రెండు బైక్‌లు చోరీ
నర్సాపూర్: నర్సాపూర్‌లో వారం రోజుల వ్యవధిలో రెండు బైకులు చోరీ అయ్యాయి. ఇళ్ల వద్ద పార్కు చేసిన బైకులను అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగలు అపహరిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం పట్టణంలోని తూప్రాన్ రోడ్డు పక్కన ఉన్న నర్సింగ్ హోం ఎదురుగా పార్కు చేసిన బైక్‌ను దొంగ ఎత్తుకుపోయిన ఘటన సీసీ కెమెరాలో రికార్డు అయింది. పట్టణంలోని 12వ వార్డులో రమేష్ ఇంటి ఎదుట పార్కు చేసిన బైక్ బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారు. ఈ విషయమై స్థానిక ఎస్‌ఐ రంజిత్‌రెడ్డిని వివరణ కోరగా బైక్ పోయినట్లు ఒక ఫిర్యాదు వచ్చిందని, విచారణ చేపట్టినట్లు చెప్పారు.
ద్విచక్రవాహనాన్ని
ఢీకొన్న కారు
ఘటనా స్థలంలోనే
మృతి చెందిన యువకుడు
చేర్యాల(సిద్దిపేట): ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొని యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన పట్టణ కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని ముస్త్యాలకి చెందిన చిగుళ్ల వంశీ(25) ఓ పురుగుమందుల కంపెనీ ప్రమోటర్‌గా పని చేస్తున్నాడు. రోజువారీ పనుల్లో భాగంగా పట్టణ కేంద్రానికి వచ్చిన వంశీ తన ద్విచక్రవాహనంపై తిరిగి ఇంటికి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చి కారు ఢీకొంది. ఈ ఘటనలో రోడ్డుపై పడ్డ వంశీ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న వారు ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలం నుంచి పారిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతుడు వంశీకి ఏడాది క్రితమే వివాహమైంది. తల్లి, భార్య ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి
ఒకరికి తీవ్ర గాయాలు
మిరుదొడ్డి(దుబ్బాక): గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అక్బర్‌పేట–భూంపల్లి మండల పరిధిలోని మోతె శివారులో గురువారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా మంథని మండలం నగరం పల్లి గ్రామానికి చెందిన నరిగె నాగరాజు (33) కూలిపని చేసుకుంటూ భార్య నిరోషా, ఇద్దరు ఆడ పిల్లలను పోషించుకుంటున్నాడు. కాగా, ఇటీవల భార్య నిరోషాతో గొడవపడ్డ నాగరాజు మనస్తాపంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇంటినుంచి వెళ్లిపోయిన నాగరాజు పలు జిల్లాలు దాటుతూ గురువారం రామాయంపేట నుంచి సిద్దిపేట వైపు 765 డీజీ జాతీయ రహదారి గుండా నడుచుకుంటూ వెళ్తుండగా...అతడి వెనుక నుంచి సిద్దిపేట మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన బోదాసు యాదగిరి అనే వ్యక్తి బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో మోతె శివారులోని భారతీ రైస్‌మిల్ వద్ద ఏదో గుర్తు తెలియని వాహనం యాదగిరి బైక్‌తోపాటు, నాగరాజును ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో నాగరాజు అక్కడిక్కడే మృతి చెందగా బైక్‌పై వెళ్తున్న యాదగిరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన యాదగిరిని 108 లో సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి యాదగిరిని తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన నాగరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి జగ్గులు ఫిర్యాదు మేరకు భూంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


