రేగోడ్(మెదక్): ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకుని అందరితో శెభాష్ అనిపించుకున్నాడు. మెదక్ జిల్లా రేగోడ్ మండలంలోని టి.లింగంపల్లికి చెందిన విజయ మూడు రోజుల క్రితం ఆటోలో నారాయణఖేడ్ వెళ్లింది. అయితే పోచారం సమీపంలో రూ.లక్ష విలువైన బంగారు ఆభరణాలు ఉన్న తన పర్సును రోడ్డుపై పోగొట్టుకుంది. అయితే అదే రూట్‌లో వెళ్తున్న సంగారెడ్డి జిల్లా మనూరు మండలంలోని బెల్లాపూర్‌కి చెందిన ఆటో డ్రైవర్ విజయ్‌కుమార్‌కు ఆ పర్సు దొరికింది. రూ. లక్ష విలువైన బంగారం ఉన్నా ఏమాత్రం ఆశపడకుండా, విజయ్ కుమార్ వెంటనే ఆ పర్సును స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ పోచయ్యకు అప్పగించాడు. అనంతరం పోలీసులు బాధితురాలిని పిలిపించి ఆ సొమ్మును సురక్షితంగా అందజేశారు. దొరికిన బంగారాన్ని పోలీసులకు అప్పగించిన ఆటో డ్రైవర్ నిజాయితీపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అలాగే పోగొట్టుకున్న బంగారం తిరిగి దక్కడంతో ఆనందానికి గురైన బాధితురాలు విజయ.. ఆటో డ్రైవర్‌తో పాటు ఎస్‌ఐని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమంలో టి.లింగంపల్లి సర్పంచ్ ఆనందం, న్యాయవాది అలిగే జీవన్ పాల్గొన్నారు.
దొరికిన రూ.లక్ష విలువైన
స్వర్ణాభరణాలు అప్పగింత


