లోతైన చర్చ.. | - | Sakshi
Sakshi News home page

లోతైన చర్చ..

Jun 25 2026 7:22 AM | Updated on Jun 25 2026 7:22 AM

12 అంశాలపై సుదీర్ఘ సమీక్ష

12 అంశాలపై సుదీర్ఘ సమీక్ష

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలును సమీక్షించే దిశ (జిల్లా డెవలప్‌మెంట్‌ కోఆర్డినేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ) సమావేశంలో బుధవారం పలు అంశాలపై లోతైన చర్చ జరిగింది. ప్రజాప్రతినిధులు, దిశ కమిటీ సభ్యులు ఎజెండాలోని సుమారు 11 అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. దిశ కమిటీ చైర్మన్‌, జహీరాబాద్‌ ఎంపీ సురేష్‌కుమార్‌ షెట్కార్‌ అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో కోచైర్మన్‌, మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ చిన్నమైల్‌ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, సంజీవరెడ్డి, కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, ఆయాశాఖల జిల్లా అదికారులు, ఇంజనీరింగ్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

● వ్యవసాయశాఖలో కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న పథకాలపై చర్చను ప్రారంభించారు. వ్యవసాయ యాంత్రీకరణ లబ్ధిదారుల ఎంపికలో అధికారులు కనీసం ప్రోటోకాల్‌ పాటించడం లేదని ఎంపీ రఘునందన్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంపీల ప్రమేయం లేకుండా ప్రతిపాదనలు, మంజూరు ఇవ్వడం సరికాదన్నారు.

● నేషనల్‌ హెల్త్‌మిషన్‌ నిధులతో జిన్నారంలో నిర్మించిన ఆస్పత్రి ప్రారంభోత్సవ తీరును రఘునందన్‌రావు తప్పుబట్టారు. దీనిపై పీఆర్‌, వైద్యారోగ్య, మున్సిపల్‌ అధికారులు రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వద్ద పనిచేస్తున్నారా..? స్థానిక ఎమ్మెల్యే వద్ద పనిచేస్తున్నారా? అని మండిపడ్డారు.

● ముంబై హైవే విస్తరణలో నిబంధనలకు విరుద్ధంగా.. ఎవరి అనుమతులు తీసుకోకుండా పటాన్‌చెరులో ప్రభుత్వ పాఠశాలల భవనాన్ని, ప్రహరీ కూల్చివేత ఘటనలో తానే స్వయంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. ఈ కేసులో నేషనల్‌ హైవే అధికారులను రిమాండ్‌ చేయిస్తానని హెచ్చరించారు.

● ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులు ఆలస్యమవుతుందనే వాదనలో వాస్తవం లేదని రఘునందన్‌రావు పేర్కొన్నారు. సకాలంలో పనులు పూర్తి చేసి రికార్డులు సమర్పిస్తే కేంద్రం వెంటవెంటనే బిల్లులు మంజూరు చేస్తోందన్నారు. అధికారుల లోపంతోనే అక్కడక్కడ సమస్య తలెత్తుతోందన్నారు.

● అమృత్‌ పథకం కింద మంజూరైన తాగునీటి పథకాల పనుల్లో జరుగుతున్న జాప్యంపై ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌ మున్సిపాలిటీల్లో ఈ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

● సోలార్‌ విధ్యుత్‌ పథకాలు పీఎం కుసుమ్‌, సూర్యఘర్‌ వంటి పథకాలపై లోతుగా చర్చించారు. కలెక్టరేట్‌, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్‌ విద్యుత్‌ యూనిట్లను ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు.

ముంబై హైవే విస్తరణపై అధికారులపై మండిపాటు

పాఠశాల కూల్చివేతపై రిమాండ్‌

కేంద్ర పథకాల అమలు తీరును చర్చించిన సభ్యులు

వాడీవేడీగా దిశ కమిటీ సమావేశం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement