‘విద్యకే తొలి ప్రాధాన్యం’ | - | Sakshi
Sakshi News home page

‘విద్యకే తొలి ప్రాధాన్యం’

Jun 25 2026 7:22 AM | Updated on Jun 25 2026 7:22 AM

‘విద్యకే తొలి ప్రాధాన్యం’ నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం దరఖాస్తుల ఆహ్వానం క్రీడలతో శారీరక దృఢత్వం మత్తుతో జీవితాలు చిత్తు

నారాయణఖేడ్‌: గ్రామాలు, గిరిజన తండాల్లో మౌలిక వసతుల కల్పన, విద్యాభివృద్ధికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని ఖేడ్‌ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని పలుగుతండా జుక్కల్‌ శివారులోని పాలిటెక్నిక్‌ కళాశాల వరకు ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన రూ.20 లక్షల పనులకు భూమి పూజ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యాపరంగా అభివృద్ధి చెందినప్పుడే గ్రామాల్లోని యువత అభివృద్ధి బాటలోకి వస్తారన్నారు. అనంతరం పలుగు తండా అంగన్‌వాడీ కేంద్రంలో చదువుతున్న చిన్నారులకు ఉచితంగా యూనిఫాంలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు రజిత, కిషన్‌నాయక్‌, పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

సంగారెడ్డి టౌన్‌: రహదారి విస్తరణలో భాగంగా గురువారం చెట్ల కొమ్మలు తొలగించనుండటంతో గురువారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని సంగారెడ్డి రూరల్‌ ఏఈ ప్రశాంత్‌ తెలిపారు. సంగారెడ్డి రూరల్‌ పరిధిలోని పోతిరెడ్డిపల్లి, శిల్పవెంచర్‌, ఆదర్శ్‌నగర్‌, కాకతీయనగర్‌, కోతులాపూర్‌, శ్రీమన్నారాయణ రోడ్డు వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

వెల్దుర్తి(తూప్రాన్‌): మాసాయిపేట కేజీబీవీలో గెస్ట్‌ టీచర్స్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్‌ఓ కృష్ణతేజ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆంగ్లం, హిందీ, గణితం, భౌతిక, జీవశాస్త్రం సబ్జెక్ట్‌లకు సంబంధించి ఇంగ్లీష్‌ మీడియంలో బోధించేందుకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. డిగ్రీతో పాటు సంబంధిత సబ్జెక్టులో బీఎడ్‌ పూర్తి చేసి ఉండాలన్నారు. నాన్‌ టీచింగ్‌ పోస్టులు అటెండర్‌–1, నైట్‌ వాచ్‌ ఉమెన్‌–1, డే వాచ్‌ ఉమెన్‌–1, హెడ్‌ కుక్‌–1, అసిస్టెంట్‌ కుక్‌–2, స్వీపర్‌–1, స్కావెంజర్‌–1 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హత కలిగిన 18 నుంచి 45 సంవత్సరాలు గల మహిళా అభ్యర్థులు ఈనెల 29 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9666494560 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

మెదక్‌ ఏఎస్పీ విక్రాంత్‌ కుమార్‌ సింగ్‌

మెదక్‌జోన్‌: క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం పొందవచ్చని అదనపు ఎస్పీ విక్రాంత్‌ కుమార్‌ సింగ్‌ అన్నారు. బుధవారం పట్టణంలో క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్‌ బారినపడిన వారిని బాధితులుగానే చూస్తున్నామని, పునరావాస కేంద్రాల ద్వారా సాధారణ జీవితంలోకి తీసుకువస్తామన్నారు. అలాంటి వారిని క్రీడల వైపు ప్రోత్సహించే లక్ష్యంతో వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందులో ప్రథమ విజేతగా నిలిచిన రాయల్‌ వారియర్స్‌ జట్టుకు రూ.5,000 నగదు, ద్వితీయ విజేతగా రాయల్‌ ఆవుసులపల్లి జట్టుకు రూ.2,500 నగదు బహుమతి, ట్రోఫీలను అందజేశారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, డ్రగ్స్‌ విక్రయం, వినియోగం, అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. అంతకుముందు యువతతో కలిసి డ్రగ్స్‌ వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మెదక్‌ డీఎస్పీ ప్రసన్నకుమార్‌, మెదక్‌ సీఐ మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

మెదక్‌ డీఎస్పీ ప్రసన్నకుమార్‌

పాపన్నపేట(మెదక్‌): మత్తు పదార్థాల వాడకం జీవితాలను నాశనం చేస్తుందని మెదక్‌ డీఎస్పీ ప్రసన్న కుమార్‌ అన్నారు. బుధవారం పాపన్నపేట ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా కొంత మంది విద్యార్థులు, యువకులు స్నేహితుల నుంచి మత్తు పదార్థాల వాడకం నేర్చుకుంటున్నారని అన్నారు. ఒకప్పుడు పట్టణాల్లో ఉన్న డ్రగ్స్‌ సంస్కృతి ఇప్పుడు పల్లెలకు పాకిందన్నారు. కొన్ని పాఠశాలలు, కళాశాలలను సైతం తాకిందన్నారు. తల్లిదండ్రులు, టీచర్లు విద్యార్థుల ప్రవర్తన సరళిపై దృష్టి సారించాలన్నారు. మత్తు పదార్థాలను అరికట్టడంలో యువకులు చైతన్యవంతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఎక్కడైనా మత్తు పదార్థాలు విక్రయిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో రూరల్‌ సీఐ కృష్ణమూర్తి, ఎస్సై శ్రీనివాస్‌గౌడ్‌, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement