జొన్నల డబ్బులేవి? | - | Sakshi
Sakshi News home page

జొన్నల డబ్బులేవి?

Jun 25 2026 7:22 AM | Updated on Jun 25 2026 7:22 AM

రైతులకు తప్పని ఎదురుచూపులు

రాయికోడ్‌(అందోల్‌): జొన్నలు విక్రయించిన రైతులు డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. వానాకాలం సాగు పెట్టుబడికి పైసలు లేక సతమతం అవుతున్నారు. అప్పులు చేసి ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ఖరీఫ్‌ ప్రారంభంలోనే ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయని వాపోతున్నారు. జిల్లాలోని రాయికోడ్‌, పెద్దచెల్మెడ, హద్నూర్‌, కంకోల్‌ తదితర ప్రాంతాల్లో మార్క్‌ఫెడ్‌ 30 కేంద్రాలు ఏర్పాటు చేసి జొన్నల కొనుగోలు చేపట్టారు. పంటను ఇంటికి చేర్చిన రైతులు కొన్ని వారాల నిరీక్షణ అనంతరం మే 20న కేంద్రాలను ప్రారంభించారు. జూన్‌ 22 వరకు కొనుగోలు ప్రక్రియ కొనసాగింది. క్వింటాల్‌ జొన్నలను రూ.3,699 మద్దతు ధరతో కొనుగోలు చేశారు. అయితే జొన్నల కొనుగోలు ముగిసినా ఇంకా కేంద్రాల్లోనే నిల్వ ఉన్నాయి. 22 వేల మంది రైతుల నుంచి 50 వేల మెట్రిక్‌ టన్నులు సేకరించిన అధికారులు, ఇంకా సుమారు 5 వేల మెట్రిక్‌ టన్నులు కేంద్రాల్లోనే ఉన్నట్లు తెలిపారు. వీటిని గోదాంలకు తరలించాల్సి ఉంది. లారీలు సకాలంలో రాకపోవడం, కూలీల కొరతతో ఆలస్యమవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇదే విషయమై మార్క్‌ఫెడ్‌ డీఎం రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. ముందుగా విక్రయించిన రైతులకు డబ్బులు జమవుతున్నాయని తెలిపారు. వారం పది రోజుల్లో రైతులందరికీ అందజేస్తామన్నారు. కేంద్రాల్లో నిల్వ ఉన్న జొన్నలను గోదాంలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement