భూమికి రెక్కలు | - | Sakshi
Sakshi News home page

భూమికి రెక్కలు

Jun 6 2026 9:13 AM | Updated on Jun 6 2026 9:13 AM

అపార్ట్‌మెంట్‌ ఎస్‌ఎఫ్‌టీ రూ.మూడు వేలు

అత్యధికంగా ఆర్సీపురంలో భూముల విలువ పెంపు

అమలులోకి పెరిగిన స్థిరాస్తులరిజిస్ట్రేషన్ల మార్కెట్‌ విలువ

గజం విలువ రూ.39 వేల నుంచి రూ.49 వేలకు

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో అత్యధికంగా రామచంద్రాపురం (ఆర్సీపురం)లో నివాస స్థలాల (ఓపెన్‌ప్లాట్ల) మార్కెట్‌ విలువ పెరిగింది. ఇక్కడ ఇప్పటివరకు గజానికి రూ.39,200 ఉండేది. ఇప్పుడు ఈ ప్రాంతంలో గజం మార్కెట్‌ విలువను రూ.49,000లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా రామచంద్రాపురంలోని కమర్షియల్‌ ఏరియాలోని నివాస స్థలాలకు ఈ మార్కెట్‌ విలువగా నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న ఈ ప్రాంతం వాణిజ్యపరంగా ఎంతో అభివృద్ధి చెందింది. ఇక్కడ మెయిన్‌ రోడ్డుకు గజం రూ.లక్షకు పైనే పలుకుతోంది. వ్యాపార, వాణిజ్యపరంగా ఎంతో అభివృద్ధి చెందడంతో ఈ ప్రాంతంలో క్రయవిక్రయాలు చాలా తక్కువేనని రిజిస్ట్రేషన్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇక రియల్‌ఎస్టేట్‌ పరంగా దూసుకుపోతున్న తెల్లాపూర్‌, కొల్లూరు, అమీన్‌పూర్‌లలో నివాస స్థలాల మార్కెట్‌ విలువలు కూడా పెరిగాయి. ఈ ప్రాంతాల్లో ఇప్పటివరకు గజానికి రూ.15,200 ఉన్న విలువ ఇప్పుడు రూ.19 వేలకు పెంచారు. ఇంద్రేశం, చిట్కుల్‌, రుద్రారం వంటి ప్రాంతాల్లో కూడా గజం రూ.2,100 ఉన్న ప్లాట్ల మార్కెట్‌ విలువ రూ.3,700లకు పెంచారు. నివాస స్థలాలతో పాటు, ఫ్లాట్లు, భూముల మార్కెట్‌ విలువను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పెరిగిన ఈ విలువలు శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి.

తక్కువ ఉన్న చోట్ల మూడు రెట్లు..

ఇప్పటి వరకు ఓపెన్‌ ప్లాట్లకు సంబంధించి తక్కువలో తక్కువ మార్కెట్‌ విలువ ఒక గజానికి రూ.700 ఉండేది. ఇప్పుడు ఈ కనీస మార్కెట్‌ విలువ ఇప్పుడు ఏకంగా రూ.2,000 వేలకు పెంచారు. అంటే దాదాపు 300 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. దీంతో తక్కువ ధర ఉన్న ప్లాట్లకు కూడా రిజిస్ట్రేషన్‌ చార్జీల మోత మోగనుంది.

వారం రోజులుగా కిక్కిరిసిన ఎస్‌ఆర్‌ఓలు ఇప్పుడు వెలవెల..

శుక్రవారం నుంచి పెరిగిన మార్కెట్‌ ధరలు అమలులోకి వస్తుండటంతో గురువారం వరకు ఎక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. మార్కెట్‌ విలువలు పెరగడంతో రిజిస్ట్రేషన్‌ చార్జీలు ఎక్కువవుతాయని చాలామంది వారం రోజులుగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. దీంతో వారం రోజులుగా సాధారణ రోజుల కంటే సుమారు 40 శాతం రిజస్ట్రేషన్ల సంఖ్య పెరిగినట్లు ఆశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని కార్యాలయం పనివేళలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు పెంచిన విషయం విదితమే. పెరిగిన ధరలు అమలులోకి వచ్చాక శుక్రవారం ఎస్‌ఆర్‌ఓ కార్యాలయాలు కాస్త వెలవెలబోయాయి.

అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్ల మార్కెట్‌ విలువ కూడా భారీగానే పెరిగింది. చదరపు అడుగుకు రూ.2,200 ఉన్న అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్ల మార్కెట్‌ విలువ ఇప్పుడు ఏకంగా రూ.2,700లకు పెంచారు. రూ.2,500 ఉన్న ఫ్లాట్లను రూ.3,000లకు పెంచారు. దీంతో అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లపై మరింత భారం పడుతోంది. ఫ్లాట్ల మార్కెట్‌ విలువను ఆయా ప్రాంతాలను బట్టి కనీసం 20 శాతం నుంచి 50 శాతం మేరకు పెరగడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement