పింఛను అక్రమాలకు కళ్లెం | - | Sakshi
Sakshi News home page

పింఛను అక్రమాలకు కళ్లెం

Jun 6 2026 9:13 AM | Updated on Jun 6 2026 9:13 AM

త్వరలో ఫేషియల్‌

రికగ్నేషన్‌ పూర్తి

ఆగస్టు నుంచి లబ్ధిదారుల ఖాతాకే పింఛను డబ్బులు

నగదు చెల్లింపులు బంద్‌

వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు అందజేస్తున్న పింఛను పంపిణీల్లో అక్రమాలకు ఇక కళ్లెం పడనుంది. ఆగస్టు నుంచి ప్రభుత్వం నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోనే పింఛను జమ చేయనుంది. ఈ నిర్ణయంతో జిల్లాలోని 1,51,955మంది పింఛనుదారులకు ప్రయోజనం చేకూరనుంది.

నారాయణఖేడ్‌: వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, పైలేరియా, డయాలసిస్‌ బాధితులకు ప్రతీ నెల రూ.2,016 చొప్పున, దివ్యాంగులకు రూ.4,016ల చొప్పున పింఛను అందజేస్తున్నారు. చాలామంది పింఛనుదారులకు గ్రామాల్లోని పంచాయతీ కార్యదర్శులు, బిల్‌ కలెక్టర్లు నగదు రూపంలో చెల్లిస్తున్నారు. గ్రామాల్లోని పోస్టాఫీసుల వద్ద లైన్‌లో వేచి ఉండి పింఛను డబ్బులు తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పింఛను డబ్బులు చెల్లింపులో పైచిలుకు వచ్చే రూ.16లు చెల్లించడంలేదని, రౌండ్‌ ఫిగర్‌ డబ్బులు మాత్రమే అందజేసి పంపిస్తూ చిల్లర లేవంటూ దాట వేస్తున్నారు. ఇలా ప్రతీ నెల చెల్లింపుల్లో వేలాది రూపాయిలు వెనుకేసుకుంటున్నారు. ఏవైనా కొర్రీలు పెడతారేమోననే భయంతో పింఛనుదారులు సైతం ఆ రూ.16లు అడగకుండానే కిమ్మనకుండా వెళ్లిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ నెల ఇంకా పింఛనురాలేదంటూ చెప్పి మళ్లీ నెలలో వస్తాయని పేర్కొంటూ ఒక నెల దండుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. మ్యాన్యువల్‌ పద్ధతిలో పంపిణీ జరుగుతుండటంతో అక్రమాలకు ఆస్కారమేర్పడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇక నేరుగా పింఛనుదారు బ్యాంకు ఖాతాలోనే జమ చేసేందకు ప్రభుత్వం నిర్ణయించింది.

చాలా గ్రామాల్లో వృద్ధులు మరణించినా వారి పేర్లపై, కొన్ని బోగస్‌ పింఛన్ల పేర లబ్ధిపొందుతున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. కాగా పింఛనుదారులు అందరినీ ఫేషియల్‌ రికగ్నిషన్‌ (ముఖ గుర్తింపు) యాప్‌లో నమోదు పూర్తి చేసి మరణించిన, అనర్హుల వివరాలతో అధికారులు త్వరలో జాబితాను తయారు చేసి ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఈనెలాఖరులోపు ఫేషియల్‌ రికగ్నేషన్‌ పూర్తి చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement