జహీరాబాద్/ఝరాసంగం(జహీరాబాద్): రానున్న రోజుల్లో సేంద్రియ వ్యవసాయానికే భవిష్యత్తు ఉందని, క్రమంగా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్ స్పష్టం చేశారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జహీరాబాద్ మండలంలోని పస్తాపూర్‌లోని డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతకుముందు మండల కేంద్రమైన ఝరాసంగం రైతు వేదికలో ఫర్టిలైజర్ దుకాణ నిర్వాహకులతో సమీక్ష నిర్వహించారు. పంటల సాగుకు రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని శివప్రసాద్ హెచ్చరించారు. సేంద్రీయ వ్యవసాయంతో పర్యావరణం సమతుల్యంగా మారుతుందన్నారు. రసాయన ఎరువులు వాడటం వల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోందని, భూములు నిస్సారం అవుతున్నాయని వివరించారు.
బయోచార్‌తో ఎరువులు
బయోచార్ ద్వారా ఎరువులను తయారు చేసుకోవాల్సిన అవసరముందన్నారు. అడవులు అంతరించిపోవడం వల్ల కూడా పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. ఎల్‌నినో వల్ల 10% తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని దీన్ని దృష్టిలో పెట్టుకుని అనువుగా ఉండే పంటలనే సాగు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాబార్డు డీడీఎం కృష్ణతేజ, ఏడీఏ భిక్షపతి, కేవీకే శాస్త్రవేత్తలు గౌరీశంకర్, వరప్రసాద్, రమేశ్, స్నేహలత, శైలజ, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్యాంసుందర్, డీడీఎస్ వైస్ చైర్మన్ రుక్మిణిరావు, ఈడీ దివ్య, బయోచార్ నిపుణులు సాయి భాస్కర్, మట్టి పరీక్షల నిపుణులు స్వామి, ఆయా ప్రాంతాల రైతులు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్


