● పంట అవశేషాలను కాల్చడంతో సారం కోల్పోతున్న భూమి ● రైతులకు అవగాహన తప్పనిసరంటున్న శాస్త్రవేత్తలు
వరి కోతలు పూర్తయిన వెంటనే పంటఅవశేషాలను లేదా వరికొయ్యలను పొలాల్లోనే కాల్చివేస్తున్నారు. దీంతో భూమిలో సాగుకు సహకరించే క్రిమికీటకాలు చనిపోయి వ్యవసాయ భూమి సారం కోల్పోతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
– సంగారెడ్డి క్రైమ్/హత్నూర (సంగారెడ్డి)
ఖరీఫ్, రబీ సాగు ఏదైనా పంట పూర్తయిన తర్వాత అవశేషాలను కాల్చివేయడం రైతులకు అలవాటుగా మారింది. ఫలితంగా అగ్ని ప్రమాదాలు సంభవించడంతోపాటు భూమిలో మార్పులు జరిగి సారం కోల్పోయే ప్రమాదముంది. దీంతో పంట దిగుబడులు తగ్గిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దీంతోపాటుగా పర్యావరణం కాలుష్యమయ్యే అవకాశముంది. కోతలు పూర్తయిన తర్వాత వరి కొయ్యలు కాల్చకుండా నేలలోనే ఉంచడంతో సేంద్రీయ ఎరువు శాతం పెరిగి రసాయన ఎరువులు వినియోగం తగ్గుతుంది. ఫలితంగా నేల మరింత సారవంతమై దిగుబడులు పెరిగే అవకాశముందని వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ దిశగా రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరముందని సూచిస్తున్నారు.
అవగాహన కల్పిస్తున్నాం.
ప్రస్తుత సీజన్‌లో వరి కొయ్యలను కాల్చవద్దన్ని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. పంట అవశేషాలు కుళ్లిపోతే అది పంటకు మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది. కొయ్యలు కాలిస్తే జరిగే అనర్థాల గురించి రైతులకు వివరిస్తున్నాం. – విజయలక్ష్మి, జిల్లా పొల్యూషన్ నియంత్రణ అధికారి
కాల్చడంతో నష్టాలివీ
వరి కొయ్యలు కాల్చడం వల్ల అధిక వేడితో భూమి సారాన్ని కోల్పోతుంది.
పర్యావరణ కాలుష్యం పెరిగి ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది.
కొన్నేళ్లు గడిచాక భూమి సాగుకు పనికిరాకుండా పోతుంది. ఫలితంగా వ్యవసాయం భారమవుతుంది.
భూమిలో ఉన్న నత్రజని, పాస్ఫరస్ వంటి పోషక పదార్థాలు శాతం తగ్గుతుంది.
భూమికి మేలు చేసే సూక్ష్మజీవులు వానపాములు పంటలకు మేలు చేసే క్రిమి కీటకాలు చనిపోతాయి.
నీళ్లల్లో తేమశాతం తగ్గుతుంది.
ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది.
పొగతో శ్వాసకోశ ఇబ్బందులు, అనారోగ్యాలకు గురయ్యే అవకాశముంది.


