క్షీరం.. క్షీణం | - | Sakshi
Sakshi News home page

క్షీరం.. క్షీణం

May 15 2026 12:49 PM | Updated on May 15 2026 12:49 PM

ఎండల తీవ్రతే కారణమంటున్న అధికారులు

పశుగ్రాసం దొరక్క ఇబ్బందులు

సాధారణ రోజుల్లో 25 వేల లీటర్ల పాల ఉత్పత్తి

ప్రస్తుతం 13 వేల లీటర్లకే పరిమితం

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఎండల తీవ్రతకు పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతోంది. సాధారణ రోజుల్లో కంటే సుమారు 45% పాల ఉత్పత్తి తగ్గిపోవడం ఆందోళనలకు గురి చేస్తోంది. జిల్లాలో సాధారణంగా రోజుకు 24 వేల నుంచి 26 వేల లీటర్ల వరకు పాల ఉత్పత్తి జరుగుతుందని విజయ డెయిరీ అధికారులు పేర్కొంటున్నారు. కానీ, ప్రస్తుతం రోజుకు 13 వేల నుంచి 14 వేల లీటర్లకే పరిమితమవుతోందని చెబుతున్నారు. ఆగస్టు నుంచి డిసెంబర్‌ వరకు పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఎండలు తక్కువగా ఉండటంతోపాటు, పశుగ్రాసం కూడా పెరుగుతుంది. దీంతో పశువులకు మేత దొరికి పాల ఉత్పత్తి బాగా ఉంటుంది. ఈ ఎండలకు పచ్చగడ్డి కాదు, కొన్ని చోట్ల పశువులు తాగేందుకు సరిగ్గా నీళ్లు కూడా దొరకడం లేదు. దీంతో పాలఉత్పత్తి దాదాపు సగానికి పడిపోయింది. పశువులకు పచ్చగడ్డి వేస్తే పాల ఉత్పత్తి అధికంగా వస్తుంది. ప్రత్యేకంగా పచ్చిమేత సాగుచేసే రైతుల పశువులకే ఇప్పుడు పచ్చగడ్డి దొరుకుతుంది. మిగతా రైతుల పశువులకు ఎండుగడ్డే దిక్కవుతోంది. దీంతో పాల ఉత్పత్తి పరిమితంగా మారుతోంది.

6,254 మంది పాడి రైతులు

జిల్లా వ్యాప్తంగా విజయ డెయిరీకి సంబంధించి 101 పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలున్నాయి. ఇందులో 6,254 మంది పాడి రైతులు సభ్యులుగా ఉన్నారు. మొత్తం 133 పాలసేకరణ కేంద్రాలున్నాయి. రైతులు ఆయా గ్రామాల్లో, సమీపంలో ఉన్న ఈ పాల సేకరణ కేంద్రాలకు వచ్చి పాలు పోస్తుంటారు. ఈ కేంద్రాల ద్వారా సేకరించిన పాలను విరిగిపోకుండా జిల్లాలో ఐదు చోట్ల ఉన్న బల్క్‌ కూలింగ్‌ సెంటర్ల (బీఎంసీ)లో పాలను చల్ల బరుస్తారు. మామిడిపల్లి, కోహీర్‌, సదాశివపేట, తడకల్‌, జోగిపేటల్లో ఈ బీఎంసీలు ఉన్నాయి. ఇలా చల్లబరిచిన పాలను జహీరాబాద్‌, పుల్కల్‌, నారాయణఖేడ్‌లలో ఉన్న మిల్క్‌ చిల్లింగ్‌ సెంటర్‌కు తరలించి కూలింగ్‌ చేస్తారు. ప్రతీ రోజు ఉదయం 8.30 గంటలలోపు ఈ ప్రాసెస్‌ను పూర్తి చేస్తారు. లేనిపక్షంలో పాలు విరిగిపోతాయి.

గేదెలే ఎక్కువ..

జిల్లాలో పశు సంపద విషయానికి వస్తే గేదెలే ఎక్కువగా ఉంటాయి. గేదెలు ఎండకాలంలో తక్కువగా, చలి, వర్షాకాలాల్లో పాలు ఎక్కువగా ఇస్తాయి. కానీ, ఆవులు మాత్రం సీజనుతో సంబంధం లేకుండా ఒకే మోతాదులో పాలు ఇస్తుంటాయి. జిల్లాలో ఆవుల కంటే గేదెల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో పాల ఉత్పత్తి ఎండాకాలానికి రాగానే తగ్గడం వర్షాకాలం, చలికాలంలో పెరగడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

అదనంగా పాల సేకరణ కేంద్రాలు

జిల్లాలో పాడి ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు రైతుల సౌకర్యార్థం అదనంగా పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. సేకరించిన పాలను బీఎంసీలకు రవాణా చేసేందుకు ఖర్చులు కాస్త పెరుగుతున్నప్పటికీ రైతుల ప్రయోజనాలను, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ కేంద్రాలను రైతులకు సాధ్యమైనంతగా సమీపంలో ఏర్పాటు చేస్తున్నాం. ఎండల కారణంగా పాల ఉత్పత్తి తగ్గుతోంది. మరో మూడు నెలల తర్వాత ఉత్పత్తి పెరుగుతుంది.

– రమేశ్‌, డిప్యూటీ డైరెక్టర్‌.

డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌.

Advertisement
 
Advertisement
Advertisement