రూ.12.80కోట్లతో అభివృద్ధి పనులు | - | Sakshi
Sakshi News home page

రూ.12.80కోట్లతో అభివృద్ధి పనులు

May 15 2026 12:49 PM | Updated on May 15 2026 12:49 PM

సదాశివపేట(సంగారెడ్డి): పట్టణ పరిధిలో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం నిరంతరం అభివృద్ధి పనులు చేపట్టాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ పేర్కొన్నారు. పట్టణంలో రూ.12.80 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు బుధవారం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మలారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అంజమ్మతోపాటు పాలకవర్గ సభ్యులతో కలిసి భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. టీయూఎఫ్‌ఐడీసీ రూ.1.40 కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి మాంసం మార్కెట్‌ వరకు వర్షం నీటి కాలువ నిర్మాణం, మోమిన్‌పేట రోడ్డు నుంచి సిద్దాపూర్‌ గ్రామం వరకు రూ.9.90 కోట్లతో బీటి రోడ్డు, సెంట్రల్‌ మిడియన్‌ లైటింగ్‌, డివైడర్‌, వర్షపు నీటి కాలువల నిర్మాణం, రూ.1.50 కోట్లతో మున్సిపాలిటీలో ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్‌ మాట్లాడుతూ..ప్రస్తుత పనులకు గతంలో టెండర్లు ఖరారైనప్పటికీ కాంట్రాక్టర్లు పనులు చేయలేదని నిర్మలారెడ్డి ప్రత్యేక చొరవచూపి పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. అనంతరం నిర్మలారెడ్డి మాట్లాడుతూ...సిద్దాపూర్‌ కాలనీ, సిద్దాపూర్‌ గ్రామం ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి చెంది సిటీ వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు.

ఎన్యూమరేటర్లకు

పక్కా ఐడెంటీకార్డు

జోగిపేట(అందోల్‌): జనగణనలో భాగంగా ఎన్యూమరేటర్లకు ఎన్నికల కమిషన్‌ పంపిణీ చేసిన ఐడెంటెటీ కార్డులను పకడ్బందీగా తయారు చేసి అందజేసింది. డూప్లికేట్‌ ఐడీని తయారు చేయకుండా ఉండేలా కార్డుపై స్కానర్‌ను ముద్రించారు. డూప్లికేట్‌ వ్యక్తులు జనగణన పేరుతో ప్రజలను మోసం చేయకుండా ఈ విధానాన్ని ఎన్నికల కమిషన్‌ ముందుకు తీసుకువచ్చిందని పలువురు ఎన్యూమరేటర్లు తెలిపారు. ఒక్కొక్కరి ఇళ్లకు వెళ్లినప్పుడు నివాసితులు అనుమానాలు వ్యక్తం చేస్తూ సరైన వివరాలు చెప్పడానికి భయపడటమే కాకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఇళ్ల వద్దకు వెళ్లిన ఎన్యూమరేటర్లు మీకేమైనా అనుమానం ఉంటే మా ఐడీ కార్డుపై ఉన్న స్కానర్‌ను స్కాన్‌ చేస్తే నా పూర్తి వివరాలు వెల్లడవుతాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ ప్రతి ఒక్క ఎన్యూమరేటర్‌కు ఐడీకార్డుతోపాటు వేసవి కాలం ఉండటంతో తెల్లటి క్యాప్‌, భుజానికి వేసుకునే బ్యాగ్‌ను అందజేశారు. అయితే ఎన్యూమరేటర్లు క్యాప్‌ నాణ్యత బాగా లేకపోవడంతో దాన్ని సంచిలోనే పెట్టుకుని స్వంత డబ్బులతో కొనుగోలు చేసిన క్యాప్‌నే వాడుతున్నారు.

బడిలో చేర్పించేలా

తల్లిదండ్రులను ప్రోత్సహించాలి

డీఈఓ వెంకటేశ్వర్లు

పటాన్‌చెరు టౌన్‌: పట్టణ, గ్రామాల్లో పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించేలా వారి తల్లిదండ్రులను ప్రజాప్రతినిధులు ప్రోత్సహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సూచించారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా పటాన్‌చెరు నియోజకవర్గస్థాయి మున్సిపల్‌ చైర్మన్లు, సర్పంచ్‌లు, మున్సిపల్‌ కౌన్సిలర్లకు బుధవారం నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడారు. ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మధ్యాహ్న భోజనం, అల్పాహారం, పుస్తకాలు యూనిఫాంలు తదితర అన్ని రకాల సౌకర్యాలను అందిస్తున్నదని ఆయన తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో ఉన్న ప్రతీ బాలబాలికను పాఠశాలలో చేర్పించడం ప్రజాప్రతినిధుల బాధ్యతగా భావించాలని సూచించారు. విద్యాభివృద్ధికి ప్రజాప్రతినిధులు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి నాగేశ్వర్‌ నాయక్‌, సుధాకర్‌, విజయ్‌ కుమార్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement