మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

May 15 2026 12:49 PM | Updated on May 15 2026 12:49 PM

నారాయణఖేడ్‌: వృత్తి నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని జహీరాబాద్‌ ఎంపీ సురేశ్‌ షెట్కార్‌ అన్నారు. ఖేడ్‌లో బుధవారం బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ నగేశ్‌ షెట్కార్‌తో కలిపి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం మహిళల సాధికారత, బాలికల విద్యాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాలు, వృత్తి శిక్షణ, తదితర కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఖేడ్‌ ఆదర్శ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన విద్యా వారోత్సవాల కార్యక్రమంలో ఎంపీ, మున్సిపల్‌ చైర్మన్‌ పాల్గొన్నారు. టీపీసీసీ సభ్యుడు శంకరయ్యస్వామి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డా. నారాయణ, అధ్యాపకులు, కౌన్సిలర్లు వివేకానంద్‌, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

పశుగ్రాసం దగ్ధం

హుస్నాబాద్‌రూరల్‌: ప్రమాదవశాత్తు మంటలంటుకొని పశుగ్రాసం దగ్ధమైంది. వివరాలు ఇలా... మండలంలోని తోటపల్లి గ్రామంలో బుధవారం డంపింగ్‌ యార్డు వద్ద చెత్తను కాల్చారు. దీంతో మంటలు సమీపంలోని పశుగ్రాసం కట్టలకు అంటుకొని దగ్ధమైనట్లు గ్రామస్తులు తెలిపారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో స్థానికులు ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ ఇంజిన్‌తో సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఒక రైతుకు చెందిన పశుగ్రాసం పూర్తిగా కాలిపోయింది.

చిరుత పులి దాడిలో

దూడ మృతి

కల్హేర్‌(నారాయణఖేడ్‌): చిరుత పులి దాడిలో దూడ మృతి చెందింది. మంగళవారం రాత్రి సిర్గాపూర్‌ మండలం కడ్పల్‌ శివారులో ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన రైతు జక్కుల శేఖర్‌ పొలం వద్ద కొట్టంలో పశువులను ఉంచి ఇంటికి వచ్చాడు. చిరుత పులి దాడి చేయడంతో దూడ మరణించింది. ఫారెస్టు బీట్‌ ఆఫీసర్‌ కృష్ణగౌడ్‌ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఆయన అక్కడే పంచనామ నిర్వహించారు. కొంత కాలంగా చిరుత పులి సంచరిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామస్తులు అప్ర మత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

విద్యుదాఘాతంతో

పాడి గేదె మృతి

కొండపాక(గజ్వేల్‌): విద్యుదాఘాతంతో పాడి గేదె మృతి చెందింది.ఈ ఘటన కుకునూరుపల్లి మండలంలోని తిప్పారం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా... గ్రామానికి చెందిన అశోక్‌గౌడ్‌ దినచర్యలో భాగంగా పాడి గేదెను మేత కోసం వదిలాడు. కాగా విద్యుత్తు స్తంభం నుంచి స్టార్టర్‌ బాక్స్‌లోకి కరంట్‌ సరఫరా అయ్యే వైర్లు నేలకు తాకేలా కిందికి వేలాడుతున్నాయి. ఈ క్రమంలో గేదె మేత మేస్తూ ఆ వైర్లకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో రైతు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని కోరాడు.

పెళ్లి చేసుకుంటానని

నమ్మించి మోసం

యువకుడి రిమాండ్‌

అక్కన్నపేట(హుస్నాబాద్‌): పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌ఐ చాతరాజు ప్రశాంత్‌ కథనం ప్రకారం... జనగామ జిల్లా పాలకుర్తి మండలానికి చెందిన ఉస్తేం ప్రవీణ్‌(22), అక్కన్నపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని ప్రేమ పేరుతో పరిచయం చేసుకున్నాడు. బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. తీరా పెళ్లి విషయం వచ్చేసరికి నిందితుడు ముఖం చాటేస్తూ వస్తున్నాడు. ఐదారు నెలలుగా పెళ్లి మాట ఎత్తితే దాటేస్తున్నాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు రెండ్రోజుల కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రవీణ్‌ను రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement