ఇద్దరి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

ఇద్దరి అదృశ్యం

May 15 2026 12:49 PM | Updated on May 15 2026 12:49 PM

శివ్వంపేట(నర్సాపూర్‌): మండల పరిఽధిలోని కొంతన్‌పల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కోమటి రమేశ్‌ ఈ నెల 11న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అదే రోజు రాత్రి అతడి ఫోన్‌ నుంచి తనకు బతకాలని లేదని, రెండు రోజుల్లో చనిపోతానని అతడి అన్న నరేశ్‌కు మెసేజ్‌ చేసి ఫోన్‌ స్విచ్చాప్‌ చేశాడు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా అతడి ఆచూకీ లభించకపోవడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పొలానికి వెళ్లొస్తానని యువకుడు..

వర్గల్‌(గజ్వేల్‌): యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గౌరారం ఎస్‌ఐ ఆరోగ్యం తెలిపిన వివరాల ప్రకారం... వర్గల్‌కు చెందిన శావుకు శివకుమార్‌(20) ప్రైవేటు జాబ్‌ చేస్తున్నాడు. అతని తల్లిదండ్రులు నర్సింలు, జయమ్మ వ్యవసాయం చేస్తున్నారు. మంగళవారం ఉదయం పొలానికి వెళ్లొస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన శివకుమార్‌ రాత్రయినా రాలేదు. కుటుంబీకులు ఫోన్‌ చేస్తే స్విచ్ఛాప్‌ వచ్చింది. ఆచూకీ కోసం చుట్టు పక్కల, తెలిసిన వారి వద్ద వెతికినా దొరకలేదు. దీంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా శివకుమార్‌ బైకును పొలం వద్ద కుటుంబీకులు గుర్తించారు. పాడుబడిన బావిలో అతని చెప్పులు తేలుతూ కన్పించాయి. దీంతో ఎస్‌ఐ పర్యవేక్షణలో ఫైర్‌ సిబ్బంది చీకట్లోనే మోటార్‌ ఏర్పాటు చేసి నీటిని పూర్తిగా తోడే పనిలో నిమగ్నమయ్యారు.

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఇసుక లారీ

బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని రేగులపల్లి శివారు రాజీవ్‌ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు ఇలా... ధాన్యం రవాణా వాహనాల సేకరణ కోసం సిద్దిపేట ఏఎంవీఐ తనిఖీలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో కోహెడ మండలం తంగళ్లపల్లి నుంచి వడ్ల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఇసుక లారీ ఢీకొట్టింది. కాగా అదుపుతప్పిన ట్రాక్టర్‌ రోడ్డు పక్కనే ఉన్న ఏఎంవీఐ అధికారి కారుతో పాటు మరో వాహనాన్ని సైతం ఢీకొట్టి ఆగిపోయింది. కాగా ఇద్దరికి స్వల్ప గాయాలవ్వగా, ప్రమాద తీవ్రతకు కారు ధ్వంసమైంది.

Advertisement
 
Advertisement
Advertisement