ఆలస్యంగా వెలుగులోకి ఘటన
మెదక్ కలెక్టరేట్: ఆడ శిశువును కన్నతల్లిదండ్రులే విక్రయించారు. ఈ ఘటన మెదక్ జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణ సీఐ మహేశ్, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ అధికారి హేమభార్గవి వివరాల ప్రకారం... కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి తండాకు చెందిన గిరిజన మహిళకు మార్చి 27న మెదక్ పట్టణ శివారులోని పిల్లికోటాల్ వద్ద గల ప్రభుత్వ మాతాశిశు కేంద్రంలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. కాగా పుట్టిన ఆడ శిశువును మధ్యవర్తుల సహాయంతో రూ.3 లక్షలకు అమ్ముకుంది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం అల్లీనగర్‌కు చెందిన దంపతులు పాపను తీసుకున్నారు. విషయం తెలుసుకున్న సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఇన్‌చార్జి హేమభార్గవి ఆధ్వర్యంలో చైల్డ్ వెల్ఫేర్ అధికారి నాగరాజు, సిబ్బంది తండాలో విచారణ చేపట్టారు. పేదరికంలో ఉన్న తమ కుటుంబంలో ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉండగా, మరో బిడ్డను పోషించే శక్తిలేక విక్రయించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు అల్లీనగర్‌కు వెళ్లి శిశువును తీసుకొచ్చారు. అనంతరం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాల మేరకు పాపను సంగారెడ్డిలోని శిశుగృహానికి తరలించారు. ఈ ఘటనలో తల్లిదండ్రులతోపాటు మొత్తం 10 మందిపై కేసు నమోదు చేశారు. కాగా ఇటీవల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తల్లిదండ్రులను మోసం చేసి నర్సు పుట్టిన శిశువును అమ్ముకున్న ఘటన మరువక ముందే ఈ ఘటన జరగడం గమనార్హం.


