భూ తగాదాలతో రైతు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

భూ తగాదాలతో రైతు ఆత్మహత్య

May 15 2026 12:49 PM | Updated on May 15 2026 12:49 PM

నంగునూరు(సిద్దిపేట): భూమి గొడవలతో మనస్తాపానికి గురైన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం పాలమాకులలో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాలు ఇలా... గ్రామానికి చెందిన ఆసర్ల కిష్టయ్య (59) భూమి విషయమై కొన్ని రోజులుగా అన్నదమ్ముళ్లతో గొడవలు జరుగుతున్నాయి. రెండు రోజుల కింద వారి మధ్య వాగ్వాదం జరగడంతో కిష్టయ్య మనస్తాపానికి గురయ్యాడు. తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చెట్టుకు ఉరి వేసుకున్నాడు. విషయం తెలుసుకున్న రాజగోపాల్‌పేట పోలీసులు పంచనామ నిర్వహించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ రైతు..

మిరుదొడ్డి(దుబ్బాక): ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు.ఈ ఘటన మండల పరిధిలోని మల్లుపల్లి లో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సతీశ్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పొగాకు స్వామి (40) వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మూడేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో పాటు, తనకున్న రెండెకరాల్లో రెండు బోర్లు వేసి అప్పులపాలయ్యాడు. అప్పులు తీర్చడం కోసం కొంత భూమిని అమ్మినా పూర్తిగా తీరకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 7న తన పొలం వద్ద గుర్తు తెలియని పురుగుల మందు తాగి అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108 ద్వారా సిద్దిపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement