ఎంఎస్‌పీపై రైతుల్లో అసంతృప్తి
చిరు
ధాన్యాలకు...
జహీరాబాద్/న్యాల్‌కల్(జహీరాబాద్)/పుల్‌కల్(అందోల్): కేంద్ర ప్రభుత్వం 2026–27 మార్కెటింగ్ సీజన్‌కుగాను 17 రకాల ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)ను పెంచింది. వీటిలో మొక్కజొన్న, పెసర పంటలకు మాత్రం మొక్కుబడిగా ధర పెంచగా వరికి మాత్రం కేంద్రం మొండిచేయి చూపించింది. మొక్కజొన్న పంటకు క్వింటాల్‌కు కేవలం రూ.10, పెసరకు రూ.12 పెంచింది. ప్రభుత్వం పెంచిన మద్దతు ధర రానున్న వానాకాలం నుంచి అమల్లోకి రానుంది. జహీరాబాద్‌తోపాటు జిల్లావ్యాప్తంగా 30వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట, 25 వేల ఎకరాల్లో పెసర పంటను రైతులు సాగుచేస్తూ వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ఎంతమాత్రం తమకు ఆమోదయోగ్యంగా లేదని ఈ రైతులు అంటున్నారు. కందులపై రూ.450, మినుముపై రూ.400, సోయాబీన్ పంటకు రూ.380, పత్తి పంటకు రూ.557 మేర పెంచడం కొంత మేలు కలిగించే విషయమన్నారు. జిల్లాలో సోయాబీన్ పంట 80వేల ఎకరాల్లో, కంది పంట 90వేల ఎకరాల్లో, మినుము పంట18వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
వాణిజ్య పంటలకు పెద్దపీట
కేంద్రం వాణిజ్య పంటలకు పెద్ద పీట వేసింది. పొద్దు తిరుగుడు పంటకు క్వింటాల్‌కు రూ.622 పెంచింది. వంట నూనెల దిగుబడి తగ్గించుకోవడానికి వీలుగా పొద్దుతిరుగుడుకు మద్దతు ధరను పెంచారు. నువ్వులకు క్వింటాల్‌కు రూ.500, వేరుశెనగకు రూ.254 పెంచారు.
వరికి మద్దతు ఏది?
తెలంగాణాలో వరిపంట ఎక్కువగా పండిస్తారు. పైగా వరికి యాజమాన్య పద్ధతులు సులువు. ఏడాదికి రెండు పంటలు సులువుగా పండిస్తారు. వరికి ఎక్కువ మద్దతు ధర చెల్లిస్తే రైతులకు గిట్టుబాటయ్యేది. కానీ క్వింటాల్ వరి ధాన్యానికి రూ.72 మాత్రమే పెంచి రైతులకు మొండి చేయి చూపింది.
–ఆర్.రాంచంద్రారెడ్డి (డీసీసీబీ మాజీ డైరెక్టర్)
మొక్కజొన్నపై చిన్నచూపు
మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర మొక్కుబడిగానే పెంచారు. క్వింటాల్‌పై కేవలం రూ.10 మాత్రమే పెంచడంతో ఎలాంటి ప్రయోజనం లేదు. పెట్టుబడుల వ్యయం రెట్టింపు అయింది. వాతావరణం అనుకూలించక పంట దిగుబడులు కూడా రావడం లేదు. కనీసం రూ.100 అయినా పెంచి ఉంటే రైతులకు మేలు చేకూరేది. –సుధాకర్, రైతు–బడంపేట
పెంచిన ధర గిట్టుబాటు కాదు
పెంచిన మద్దతు ధర కొంత ఊరటనిచ్చినా కూలీలు, ఎరువుల రేట్లు బాగా పెరిగిపోయినందున ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర సరిపోదు. జిల్లాలో అధికశాతం రైతులు పత్తి పంటను సాగు చేసుకుంటున్నారు. క్వింటాల్‌కు రూ.10వేలు గిట్టుబాటు ధర ఉంటే గిట్టుబాటవుంది.
–రాజప్ప, రైతు–చాల్కి
పప్పు ధాన్యాలు, వంట నూనెల పంటలకు ప్రాధాన్యత
మొక్కజొన్న, పెసర పంటలకు నామమాత్రంగా పెంపు
కేంద్రం ప్రభుత్వం పెంచిన ధరల్లో చిరుధాన్యాలకు ప్రాధాన్యతనిచ్చారు. జొన్న క్వింటాల్‌కు రూ.324, రాగులు రూ.319, కందులు క్వింటాల్‌కు రూ.450 పెంచారు. సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లో చిరు ధాన్యాలు ఎక్కువగా పండిస్తారు. పత్తి పంటను జోగిపేట,సంగారెడ్డి, సదాశివపేట ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తారు.


