అభివృద్ధికి సహకరించండి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి సహకరించండి

May 15 2026 12:25 PM | Updated on May 15 2026 12:25 PM

కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ను కోరిన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి

పటాన్‌చెరు టౌన్‌/పటాన్‌చెరు: పటాన్‌చెరు నియోజకవర్గ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి కోరారు. సంగారెడ్డిలోని కలెక్టరేట్‌లో గురువారం కలెక్టర్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. 2025–2026 ఏడాదికి సంబంధించి స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ ద్వారా చేపట్టనున్న అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అమీన్‌పూర్‌ డివిజన్‌ పరిధిలోని వడకపల్లికోట అభివృద్ధి కోసం హెచ్‌ఎండీఏ అధికారులతో చర్చించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. హెచ్‌ఎండిఏ నిధులతో కోటను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కలెక్టర్‌...ప్రజోపయోగ కార్యక్రమాలకు ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు వివరించారు.

గణేశ్‌గడ్డ దేవాలయాభివృద్ధికి కృషి

గణేశ్‌గడ్డ శ్రీ సిద్ధి వినాయక దేవాలయం ఆవరణలో నిర్మించిన మూడు రాజగోపురాలను ఆగస్టు 16న ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి తెలిపారు. అదేరోజు ఆలయ శిఖర ప్రతిష్ఠాపన సైతం నిర్వహించనున్నట్లు తెలిపారు. గణేశ్‌గడ్డ దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పాలక వర్గం, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రముఖులు, ఆలయ ధర్మకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ఆలయాభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గుడికి నాలుగు వైపులా నిర్మిస్తున్న రాజగోపురాల నిర్మాణ పనులు పూర్తయ్యాయన్నారు. రూ.1.50కోట్ల సొంత నిధులతో వీటిని నిర్మించినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement