అదనపు కలెక్టర్ పాండు
జోగిపేట(అందోల్): అకాల వర్షాలు కురిసే అవకాశమున్నందున ధాన్యాన్ని వెంట వెంటనే అన్‌లోడ్ చేసుకోవాలని మిల్లర్లకు అదనపు కలెక్టర్ పాండు ఆదేశించారు. జోగిపేటలోని రామకృష్ణ, పుల్కల్ మండలం కోడూరులోని ఎస్‌బీఎం రైస్ మిల్లును పాండు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిల్లులకు కొనుగోలు కేంద్రాల నుంచి ఎన్ని లారీల ధాన్యం పంపించారు? వాటిని అన్‌లోడ్ చేసుకున్నారా? ఎంత పరిమాణంలో మిల్లింగ్ జరిపారు, మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ఎలా భద్రపరుస్తున్నారు వంటి అంశాలను పరిశీలించారు. మిల్లుల వద్ద ఏమైనా తరుగు తీస్తున్నారా అని ఆరా తీశారు. అవసరమైతే ఎక్కువ సంఖ్యలో హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సామర్థ్యం మేరకు పూర్తిస్థాయిలో మిల్లింగ్ చేయాలని స్పష్టం చేశారు. ధాన్యం నిల్వ చేసేందుకు సమీపంలోని రైతు వేదికలను వినియోగించుకోవాలని తెలిపారు. అందోలు, పుల్కల్ తహసీల్దార్లు ఆయన వెంట ఉన్నారు.


