నిమ్జ్ రహదారిపై భద్రతేదీ?
మూల మలుపులు, చౌరస్తాల వద్ద పొంచివున్న ప్రమాదం
● తరచూ జరుగుతున్నా పట్టించుకోని అధికారులు ● కనీస చర్యలు చేపట్టాలని వినతి
సంగారెడ్డి జోన్: జహీరాబాద్ నియోజకవర్గంలో సుమారు 12 వేలకు పైగా ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న నిమ్జ్ ప్రాజెక్టు కోసం నిర్మించిన రహదారిలో భద్రతా ప్రమాణాలు కరువయ్యాయి. దీంతో ఈ రహదారిలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదు. జహీరాబాద్ మండలంలోని హుగ్గెల్లి శివారు నుంచి ఝరాసంగం మండలంలోని బర్దీపూర్ శివారు వరకు సుమారు రూ.100 కోట్లకు పైగా వ్యయంతో వంద అడుగుల విస్తీర్ణంతో రహదారిని నిర్మించారు. ఈ రహదారిని హైదరాబాద్–ముంబై జాతీయ రహదారికి అనుసంధానం చేశారు. కొత్తగా నిర్మించిన ఈ రహదారిపై చాలా చోట్ల మూలమలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. ఇక చౌరస్తాల గురించి చెప్పనవసరంలేదు.
వెలగని విద్యుత్ దీపాలు
నిమ్జ్ రహదారిపై సుమారు 350కు పైగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి సరఫరాకు కనెక్షన్ ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా అవి వెలిగేందుకు ఏర్పాటు చేసిన స్విచ్ ఆన్ చేయలేకపోతున్నారు. రాత్రి వేళలో ప్రయాణాలు సాగించే క్రమంలో ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని చౌరస్తాల వద్ద ప్రమాద నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రతీరోజు విద్యుత్ దీపాలు వెలిగే విధంగా చూడాలని కోరుతున్నారు.
ఈ నాలుగు చౌరస్తాల్లోనూ...
ఝరాసంగం నుంచి జహీరాబాద్ పట్టణానికి ప్రతీరోజు వందలాది సంఖ్యల్లో వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. మాచ్‌నూర్ గ్రామ శివారులోని కేంద్రీయ విద్యాలయం సమీపంలో ఝరాసంగం–జహీరాబాద్ రహదారి, నిమ్జ్ దారులతో చౌరస్తాగా మారింది. వీటితోపాటు మరో నాలుగు చౌరస్తాలున్నాయి. అక్కడి ప్రాంతాల్లో కనీస భద్రత చర్యలు చేపట్టకుండా రోడ్డును నిర్మించి వదిలేశారు. రోడ్డుదాటే క్రమంలో ప్రమాదాలు జరిగి ప్రయాణికులు తీవ్ర గాయాలపాలవుతున్నారు. రహదారికి ఇరువైపులా స్పీడ్ బ్రేకర్లు, కనీస సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. అంతేకాకుండా అటువైపు నుంచి వచ్చే వాహనాలు కనిపించడం లేదు. రోడ్డు నిర్మించే కాంట్రాక్టర్, పర్యవేక్షణ జరిపే అప్పటి అధికారులు కుమ్మకై ్క మామూలు తీసుకుని కనీస పర్యవేక్షణ చేపట్టలేకపోయారని విమర్శిస్తున్నారు.
నిమ్జ్ రహదారిపై భద్రతేదీ?


