పరీక్షల భయం వీడండి
టెలీమానస్‌తో విద్యార్థులకు మానసిక భరోసా
● ఆత్మస్థైర్యం నింపుతున్న నిపుణులు
● జిల్లాలో పరీక్షలు రాయనున్న
45,454 మంది విద్యార్థులు
ప్రతి విద్యార్థికి జీవితంలో 10వ తరగతి, ఇంటర్ కీలక మలుపు. ఈ తరుణంలో కొంతమంది విద్యార్థులు పరీక్షలంటే ఒత్తిడికి, భయానికి లోనవుతున్నారు. ప్రస్తుతం వారికి టెలీమానస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఫోన్ చేస్తే వైద్య నిపుణులు మానసిక ధైర్యాన్ని పెంపొందించి, చిట్కాలను వివరిస్తారు.
– సంగారెడ్డి క్రైమ్
ప్రస్తుతం 2026–27 వార్షిక పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభమవుతున్నాయి. జిల్లాలోని ఇంటర్ విద్యార్థులు( 29,230), పదో తరగతి విద్యార్థులు(22,454) పక్క ప్రణాళికతో సిద్ధమవుతున్నారు. పరీక్షా అంటే భయం, వచ్చిన మార్కులపై నిరాశ, చదివిన అంశాలు గుర్తుకు రావడం లేదని, ఇతర విద్యార్థులతో పోలిస్తే తాము వెనుకబడి పోతున్నామనే భావనలో ఉన్నారు. ఇష్టంగా చదివితే ఏదైనా సాధ్యమే. ఈ విషయంలో తరగతిలో ఉపాధ్యాయులు, ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించాలి. వార్షిక పరీక్షల సమయంలో తమ పిల్లలను చెడు ఆలోచనలకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ప్రతి విద్యార్థికి ఒకటి, రెండు సబ్జెక్ట్‌లపై ఇష్టం ఉంటుంది. వాటిని వేగంగా చదివేసి మిగిలిన వాటికి సమయం పడుతుందని తమ పిల్లలకు అర్థమయ్యేలా టీచర్‌లు, తల్లిదండ్రులు వివరించాలి. సమాజంలోని మహనీయులను మార్గదర్శకంగా తీసుకోవాలని పిల్లల్లో స్ఫూర్తి నింపాలి.
స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా..
వార్షిక పరీక్షలు పూర్తయ్యే వరకు పిల్లలను సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచాలి. స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ అతి వినియోగంను కట్టడి చేయాలి. పరీక్షల సమయంలో తల్లిదండ్రులు పిల్లల ముందు టీవీగాని, ఫోన్ వాడరాదు. పిల్లలకు ఇంట్లో చదువుకునేలా మంచి వాతావరణం నెలకొల్పాలి.
విద్యార్థులకు టెలీమానస్ సర్వీస్
ప్రస్తుతం ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు టెలీమానస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్లు 14416, 18008914416 అందుబాటులోకి తీసుకొచ్చింది. పరీక్షల సమయంలో ఈ నంబర్లకు విద్యార్థులు ఫోన్ చేస్తే మానసిక ధైర్యాన్ని పెంపొందించి, చిట్కాలను వైద్య నిపుణులు మొబైల్‌లో గాని, తమ సెషన్‌లో గాని వివరిస్తారు.


