చేజారి పోకుండా!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో కాంగ్రెస్‌లో నెలకొన్న వర్గ విభేదాల విషయంలో ఆ పార్టీ అధినాయకత్వం ముందుజాగ్రత్త పడుతోంది. ఈ ఆధిపత్య పోరు కారణంగా ఏకంగా మున్సిపాలిటీలే ‘చేయి’జారిపోయే అవకాశాలుండటంతో నారాయణఖేడ్, పటాన్‌చెరు, జహీరాబాద్ నియోజకవర్గాల్లోని ముఖ్య నాయకుల మధ్య సమన్వయం చేసే ప్రయత్నాలు చేసింది. మున్సిపల్ ఎన్నికల కోసం ఇన్‌చార్జిలుగా నియమితులైన మంత్రులు అజాహరుద్దీన్, వివేక్ వెంకటస్వామి ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఈ మూడు నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఏమాత్రం తేడాలు వచ్చినా అందుకు కారకులైన వారిపై కఠిన చర్యలుంటాయని జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో నేతల మధ్య సమన్వయలోపం కారణంగా పార్టీకి ఆశించిన మేర ఫలితాలు రాలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మున్సిపల్ ఎన్నికల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటోంది.
అజహర్, దామోదరల సూచనలతో...
నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కౌన్సిలర్ టికెట్ల కోసం ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎంపీ సురేశ్ షెట్కార్ అనుచరుల మధ్య పోటీ ఉంది. దీంతో మంత్రులు అజాహరుద్దీన్, దామోదరల సూచనల మేరకు ఇద్దరు నేతలూ చర్చించుకుని అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ జిల్లాలో పట్టు నిలుపుకుంది. సుమారు 40% మున్సిపాలిటీలను గులాబీ పార్టీ గెలుచుకుంది. అయితే ఆయా నియోజకవర్గాల్లో నేతల మధ్య నెలకొన్న విభేదాలే ప్రత్యర్థి పార్టీ గెలుపునకు ప్రధాన కారణమని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. పైగా ఇప్పుడు పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలు కావడంతో సమన్వయం లేకుంటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో వర్గవిభేదాల విషయంలో మంత్రులు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
వైరి వర్గాల సమన్వయంపై ఇన్‌చార్జి మంత్రుల నజర్
కలిసి పనిచేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరికలు
కొలిక్కివచ్చిన కాంగ్రెస్ టికెట్ల కేటాయింపు
పటాన్‌చెరులో ఇలా...
పటాన్‌చెరు నియోజకవర్గంలో అత్యధికంగా ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. కాటాశ్రీనివాస్‌గౌడ్, నీలంమధు వర్గీయులు ఆయా మున్సిపాలిటీల్లోని కౌన్సిలర్ టికెట్ల కోసం పట్టుబడుతున్నారు. దీంతో ఈ టికెట్ల విషయంలో కొంత గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య సమన్వయంతో టికెట్లు ఖరారు చేయాలని మంత్రి వివేక్ సూచించినట్లు తెలుస్తోంది. కాగా, ఒకరు రెండు మున్సిపాలిటీలు, మరొకరు మూడు మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
జహీరాబాద్‌లో
జహీరాబాద్, కోహీర్ మున్సిపాలిటీల్లోని ఇదే పరిస్థితి నెలకొంది. ఈ రెండు మున్సిపాలిటీల్లోని టికెట్ల కోసం మాజీమంత్రి చంద్రశేఖర్, సెట్విన్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గిరిధర్‌రెడ్డి వర్గీయులు ఆశిస్తున్నారు. ఎంపీ షెట్కార్ అనుచరులు కూడా టికెట్ల రేసులో ఉన్నారు. దీంతో ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చిన వార్డుల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. ఏకాభిప్రాయం కుదరని వార్డుల విషయంలో ఆ పార్టీ సర్వే ఆధారంగా టికెట్లు ఖరారు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.


