తెగని టికెట్ల పంచాయితీ
జహీరాబాద్: నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు శుక్రవారం ఒక్క రోజు మాత్రమే గడువు మిగిలి ఉంది. అయినా జహీరాబాద్, కోహీర్ మున్సిపాలిటీలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాలను ఇప్పటి వరకు ప్రధాన పార్టీలు విడుదల చేయలేదు. టికెట్ల కోసం ఆశావాహులు అధికంగా ఉండటంతో మొత్తం అభ్యర్థుల జాబితాలను విడుదల చేయలేదు. పోటీ తక్కువ ఉన్న వార్డులకు సంబంధించి అభ్యర్థుల పేర్లను మాత్రమే ప్రకటించాయి. రెండు రోజుల నామినేషన్లు పూర్తయినా కాంగ్రెస్ పార్టీ మాత్రం జహీరాబాద్ మున్సిపాలిటీలోని 37 వార్డులకుగాను గురువారం రాత్రి 19మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించింది. మిగతా జాబితాను శుక్రవారం ప్రకటించే అవకాశం ఉంది. జాబితా ప్రకటించే విషయంలో జాప్యం జరిగితే ఆశావహులతో నామినేషన్లు వేయించి, ఖరారు చేసే అభ్యర్థులకు బీ ఫారాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ మాత్రం 21 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది. మిగతా చోట్ల పోటీ ఎక్కువ ఉన్నందున పెండింగ్‌లో పెట్టింది.
కాంగ్రెస్... హైదరాబాద్ కేంద్రంగా
టికెట్లను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ కేంద్రంగా కార్యాచరణను చేపట్టింది. పార్టీలో నాలుగు గ్రూపులు ఉండటంతో అభ్యర్థుల ఎంపిక విషయంలో వివాదాలు తలెత్తినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో పార్టీ అధిష్టానవర్గం అందరినీ ఒకేచోట చేర్చి టికెట్లను ఖరారు చేసే బాధ్యతను అప్పగించినట్లు సమాచారం. జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ ఆధ్వర్యంలో సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్.గిరిధర్‌రెడ్డి, మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్, పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఎస్.ఉజ్వల్‌రెడ్డి, ఐడీసీ మాజీ చైర్మన్ ఎండీ.తన్వీర్ సమావేశమై టికెట్లను ఖరారు చేసినట్లు తెలిసింది. పట్టువిడుపులకు పోకుండా సామరస్య ధోరణిలో అభ్యర్థుల ఖరారు ప్రక్రియను చేపట్టినట్లు సమాచారం.
బీఆర్‌ఎస్.. ముగ్గురు నేతలతో ఎంపిక
బీఆర్‌ఎస్ అభ్యర్థులను ఖరారుచేసే బాధ్యతను ముగ్గురు నేతలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు, ఎన్నికల ఇన్‌చార్జి దేవిప్రసాద్, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్ ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపిక చేపట్టినట్లు సమాచారం. ఇప్పటివరకు 21 మంది అభ్యర్థులను ఖరారు చేసి జాబితా ప్రకటించారు. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, ప్రజా బలం ఉన్న వారికే టికెట్లను కేటాయించినట్లు పార్టీ నేతలు పేర్కొన్నారు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలను బీజేపీ ఇప్పటి వరకు ప్రకటించలేదు. అయినా పలు వార్డుల నుంచి ఆశావహులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీల్లో టికెట్లు రాని వారు ఉంటే వారిలో ప్రజాబలం కలిగివున్న వారికి టికెట్లను కేటాయించే విషయమై పరిశీలిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అందువల్లే జాబితాను ప్రకటించే విషయంలో ఆలస్యం జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే మున్సిపల్ పరిధిలో మజ్లిస్ పార్టీ పలు వార్డుల్లో బలంగా ఉంది. అయినా పార్టీ ఇప్పటివరకు జాబితాను ప్రకటించలేదు.
సగంమందితోనే బీఆర్‌ఎస్,కాంగ్రెస్ జాబితాలు
ఇంకా ప్రకటించిన బీజేపీ
ఆశావహులంతా నామినేషన్ల దాఖలు
అభ్యర్థిత్వాల ఖరారు తర్వాతే బీ ఫారాలు


