బొగ్గు స్కామ్ దృష్టి మళ్లించేందుకే
కేసీఆర్‌కు సిట్ నోటీసులపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డి: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులివ్వడాన్ని ఎమ్మెల్యే చింతాప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డి చేసిన భారీ బొగ్గు కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సిట్ నోటీసుల డ్రామాను సీఎం రేవంత్‌రెడ్డి నడిపిస్తున్నారని ఆరోపించారు. బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టినందుకు మాజీమంత్రులు హరీశ్‌రావుకు, గట్టిగా నిలదీసినందుకు కేటీఆర్‌కు నోటీసులిచ్చారని ప్రభాకర్ చెప్పారు. రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, కేసీఆర్ అనే శక్తిని ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను గాలికి వదిలి ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌కు జిల్లా బీఆర్‌ఎస్ శ్రేణులు, తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు అండగా ఉంటారని తెలిపారు. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలను మానుకోకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
కక్షసాధింపే: నరోత్తం
జహీరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయ కుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు సిట్ నోటీసులివ్వడం కక్షసాధింపు చర్యేనని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై.నరోత్తం గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ జోలికి వస్తే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. పాలన చేతగాక ప్రతిపక్ష నాయకులకు నోటీసులిప్పించడం రేవంత్‌రెడ్డి చిల్లర రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక దృష్టి మళ్లించే రాజకీయాలు చేయడం సీఎంకు తగదన్నారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా బీఆర్‌ఎస్ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.


