మోసమే కాంగ్రెస్ నైజం
● కేసీఆర్ పాలనలో స్వర్ణయుగం ● మాజీ మంత్రి హరీశ్‌రావు
చిన్నకోడూరు(సిద్దిపేట): అనేక హామీలతో కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందని, మోసం చేయడమే ఆ పార్టీ నైజమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. గురువారం మండల పరిధిలోని కిష్టాపూర్‌లోని సమ్మక్క సారక్క జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఇచ్చిన మామీలను అమలు చేయడంలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే ప్రేమ లేదని, రైతులకు సకాలంలో యూరియా అందడం లేదని, సక్రమంగా విద్యుత్ సరఫరా చేయకపోవండతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. కేసీఆర్ పాలన స్వర్ణయుగం లాంటిదన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కాసం రాజిరెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
రాక్ పాయింట్ ఏర్పాటు చేయండి
సిద్దిపేటజోన్: సిద్దిపేట ప్రాంతంలో రైలు సౌకర్యం ఉందని, ఉన్నతాధికారులతో మాట్లాడి ఒక రాక్ పాయింట్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి హరీశ్‌రావు జిల్లా అధికారులకు సూచించారు. గురువారం పత్తి మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, జిల్లా సహకార శాఖ అధికారి, జిల్లా మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, మార్కెట్ కమిటీ సెక్రటరీలతో పలు అంశాలపై అరా తీశారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పీఏసీఎస్ చైర్మన్ లను తొలగించగా, న్యాయస్థానం కొట్టివేసిందని, మరి ఇప్పుడు చైర్మన్లు ఉన్నట్టా ... లేనట్టా అని అడిగి తెలుసుకున్నారు. రైతు బజార్‌లో అనేక సమస్యలు ఉన్నాయని ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పరిష్కరించాలని సూచించారు. సన్ ప్లవర్ కొనుగోలు మీద ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. సన్న వడ్ల బోనస్ డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయని, అదేవిధంగా వడగండ్ల వాన వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు, రైతులు పాల్గొన్నారు.


