మోడల్ కాలనీ
● కరువైన కనీస వసతులు ● గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో దుస్థితి
గజ్వేల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని డబుల్ బెడ్రూమ్ మోడల్ కాలనీలో సమస్యలు రోజురోజుకూ జటిలంగా మారుతున్నాయి. అధికారికంగా గృహప్రవేశాలు జరగకపోగా.. లబ్ధిదారులే సుమారు ఆరు వందల మందికిపైగా తమకు కేటాయించిన ఇళ్లల్లో నివాసం ఉంటున్నారు. ఇలాంటి సందర్భంలో కాలనీలో కనీస వసతులు కరువై అల్లాడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ ఈ సమస్య ప్రధానంగా తెరపైకి వస్తున్నది.
మాజీ సీఎం కేసీఆర్ తన సొంత నియోజకవర్గంలోని గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి మొత్తం 1250 ఇళ్ల మోడల్ కాలనీని మంజూరు చేసి పూర్తి చేయించారు. కానీ ఇళ్ల పంపిణీ వ్యవహారం ఏళ్ల తరబడి నానుతూ వచ్చింది. వివిధ రకాల ఆందోళనల తర్వాత 2023 మార్చి 21న అధికారులు తుది లక్కీ డ్రా నిర్వహించి 1100 మందిని ఎంపిక చేశారు. కానీ ఆ కాలనీలో తాత్కాలికంగా నివాసం ఉంటున్న మల్లన్నసాగర్ నిర్వాసితులను ఖాళీ చేయించి, హ ప్రవేశాలు చేయించడం అధికారులకు సవాలుగా మాంది, కొంత కాలంగా చాలామంది నిర్వాసితులు ఖాళీ చేసి వెళ్లిపోగా..లక్కీ డ్రా ద్వారా ఎంపికై న లబ్ధిదారులు నేరుగా తమకు కేటాయించిన నంబర్లలో సుమారు 600 మంది వరకు ఇళ్లను స్వాధీనం చేసుకొని ప్రస్తుతం నివాసం ఉంటున్నారు.
కాలనీలో కనీస సౌకర్యాలేవీ..?
గృహప్రవేశాల గురించి చొరవ చూపని అధికారులు, ప్రజాప్రతినిధులు కనీసం తాము కాలనీలో వచ్చి నివాసముంటున్న సందర్భంలో ఇక్కడ కల్పించాల్సిన కనీస వసతులను సైతం పట్టించుకోడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. తాము మున్సిపాలిటీలో అంతర్భాగం కాదా...? అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా గృహప్రవేశాలు అధికారికంగా చేపట్టి.. పట్టాలు ఇవ్వపోవడం, కాలనీలో పారిశుద్ద్యలోపం పేరుకుపోవడం, వీధిదీపాలు లేక రాత్రి వేళల్లో చీకట్లు అలుముకోవడం, కుక్కల బెడద, రాత్రివేళల్లో మందుబాబుల వీరంగం తదితర సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 25న కాలనీవాసులు ధర్నా చేపట్టారు. తమ సమస్యలను పట్టించుకోకపోతే మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తామని కూడా హెచ్చరించారు. కాలనీలో ప్రస్తుతం నివసిస్తున్న వారివి 4వేల పైచిలుకు ఓట్లు ఉన్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలోనే తమకు ప్రత్యేకంగా రెండు వార్డులు కేటాయించాల్సిన విషయాన్ని కూడా అధికారులు పట్టించుకోలేదని వాపోతున్నారు. మొత్తానికి వీరి సమస్య ప్రస్తుతం ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా మారబోతున్నది.
మమ్మల్ని పట్టించుకోరా...?
కొంత కాలంగా కాలనీలో నివాసం ఉంటున్నా.. మా సమస్యల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కనీస సౌకర్యాల్లేక ఇబ్బంది పడుతున్నాం. మాకు అధికారికంగా పట్టాలు ఇవ్వాలనే విషయాన్ని కూడా మరిచిపోయారు. మా సమస్యలు తీరే వరకు పోరాడుతాం.
– దయాకర్, కాలనీ కమిటీ అధ్యక్షుడు
రాత్రి పూట లైట్లు లేక భయం
మా కాలనీలో వీధి దీపాలు లేక రాత్రి పూట బయటకు రావాలంటే భయపడుతున్నాం. పారిశుద్ధ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం. మాకు ఇప్పటికై నా కనీస సౌకర్యాలు కల్పించాలి.
– నాగేందర్, డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసి
మోడల్ కాలనీ


