వెయ్యేళ్ల చరిత్రగల గుంతపల్లి
కొండాపూర్(సంగారెడ్డి): మండల పరిధిలోని గుంతపల్లికి వెయ్యేళ్ల చరిత్ర ఉందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ, డా.ఈమని శివనాగిరెడ్డి అన్నారు. సర్పంచ్ పడమటి అనంతరెడ్డి ఆహ్వానం మేరకు గురువారం గుంతపల్లి శివారులోని శివాలయం, బురుజును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాలయం ద్వారం, వాటిపై ఉన్న పూర్ణకలశ చిహ్నాలు, గర్భాలయంలోని నల్ల శాసనపు రాతిలో, నునుపుగా చెక్కిన పానవట్టం, బ్రహ్మసూత్రం (లక్ష్మణోద్ధారణ రేఖ) ఉన్న శివలింగం, కల్యాణ చాళుక్య వాస్తు రీతికి అద్దం పడుతున్నాయన్నారు. సా.శ. 1076 నుంచి 1125 వరకు పరిపాలించిన కల్యాణ చాళుక్య చక్రవర్తి ‘త్రిభువనమల్ల’బిరుదాంకితుడైన ఆరో విక్రమాదిత్యుడికి పటాన్‌చెరు తాత్కాలిక రాజధాని(నేలవీడు)గా ఉందని చెప్పారు. ఆ కాలంలోనే ఈ శివాలయ నిర్మాణం జరిగి ఉంటుందని అభిప్రాయపడ్డారు. వెయ్యేళ్ల చరిత్ర గల ఈ ఆలయాన్ని, గ్రామ మధ్యలో 150 యేళ్ల క్రితం నిర్మించిన బురుజును కాపాడుకోవాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.
పురావస్తు పరిశోధకుడు
డా.ఈమని శివనాగిరెడ్డి


