బండమీదిపల్లిలో దారుణం
వెల్దుర్తి(తూప్రాన్): వివాహేతర సంబంధం నేపథ్యంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మండలంలోని శంశిరెడ్డిపల్లి పంచాయతీ పరిధి బండమీదిపల్లిలో ఘటన వెలుగుచూసింది. తూప్రాన్ సీఐ రంగాకృష్ణ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గంపల బాలేష్(48)కు అదే గ్రామానికి చెందిన అప్పల సాయిలు భార్యతో కొన్ని రోజులుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. పలుమార్లు హెచ్చరించినా తీరు మారలేదు. ఈ క్రమంలో భార్యతో చనువుగా ఉన్న సమయంలో సాయిలు నేరుగా పట్టుకొని పదునైన ఆయుధంతో బాలేష్‌పై దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌కు నేరుగా వెళ్లి లొంగిపోయాడు. బుధవారం అర్థరాత్రి దాటాక పోలీసులు గ్రామ శివారులోని పంట పొలాల్లో మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గురువారం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అప్పల సాయిలు, శ్రీశైలం, శేఖర్‌తో పాటు పాంబండకు చెందిన తలారి యాదగిరి కలిసి తన భర్తను హత్య చేశారని మృతుడి భార్య మనమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
వివాహేతర సంబంధం నేపథ్యంలో వ్యక్తి హత్య
పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిననిందితుడు


