నమ్మకం, సేవాభావం
ఇచ్చిన హామీని నిలబెట్టుకునే వాళ్లం ప్రజలు విశ్వాసంతో ఓట్లేసేవారు ఇప్పుడు స్వార్ధ, అవకాశవాదరాజకీయాలే ఎక్కువ పవర్ లేని చైర్మన్ పదవి ఒక వెంచర్ ఏర్పాటు చేయాలన్నా అధికారం లేదు సాక్షితో మెదక్ బల్దియామాజీ చైర్మన్ భట్టి జగపతి
నాడు రాజకీయమంటే
మెదక్‌జోన్: నాడు రాజకీయం అంటే సేవాతత్పరతతోపాటు ప్రజా విశ్వాసాన్ని చూరగొనేలా పనులు చేయడం. నేడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. అసలు రాజకీయం అర్థాలే మారిపోయాయి. సేవాభావం స్థానంలో స్వార్థం, విశ్వాసం స్థానంలో అవకాశవాదం వచ్చి చేరాయని మెదక్ మున్సిపాలిటీకి మూడుసార్లు చైర్మన్‌గా వ్యవహరించిన భట్టి జగపతి చెబుతున్నారు. ప్రస్తుతం వయోభారంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండగా ఈ ఎన్నికల్లో ఆయన సతీమణి, కుమారుడు కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాటి నుంచి నేటివరకు రాజకీయాల్లో వచ్చిన విపరీతధోరణులపై సాక్షితో ముచ్చటించిన
విశేషాలు ఆయన మాటల్లోనే...
మూడుసార్లు చైర్మన్‌గా..
‘‘1952లో ఆవిర్భవించిన మెదక్ మున్సిపాలిటీకి ఇప్పటివరకు 14 మంది చైర్మన్లుగా వ్యవహరించగా..అందులో మూడుసార్లు (1981, 1995, 2005)లలో చైర్మన్‌గా వ్యవహరించాను. 1981లో మున్సిపల్ ఎన్నికల్లో తాను ఖర్చుపెట్టింది కేవలం రూ.30వేలే. ఇక రెండోసారి 1995 ఎన్నికల్లో పెట్టిన ఖర్చు రూ.80 వేలు. అప్పట్లో ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే తాపత్రయం ఉండేది. ఓటర్లు సైతం నాయకుడిపై అంతే విశ్వాసంతో ఓట్లు వేసేవారు. రెండోసారి చైర్మన్‌గా పోటీ చేసిన సమయంలో తనను రాజకీయంగా అణగదొక్కాలని నాటి మంత్రి కరణం రామచంద్రారావు తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నారు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయగా...ప్రజలు భారీ మెజార్టీతో తనను గెలిపించారు. అప్పట్లో మున్సిపల్ చైర్మన్‌కు కాస్త ఎక్కువ అధికారాలే ఉండేవి. ఆ అధికారాలతోనే తన పదవీకాలంలో ప్రజలకు అనేక పనులు చేసిపెట్టాను. పట్టణంలో చాలా కాలనీలను ఏర్పాటు చేయడంతోపాటు పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇవ్వగలిగాను. చాలామందికి ఇళ్లు మంజూరు చేయించగలిగాను. ఇలా ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడి పూర్తి చేసిన అభివృద్ధి పనులే తాను మూడుసార్లు చైర్మన్‌గా గెలుపొందడానికి కారణమయ్యాయి. ప్రస్తుతం ఒక వెంచర్ ఏర్పాటు చేయాలన్నా చైర్మన్‌కు అధికారం లేదు. ఎమ్మెల్యే, కలెక్టర్లకు చైర్మన్ అధికారాలను బదిలీ చేసేశారు.
మున్సిపల్ కార్యాలయం నిర్మాణం
మున్సిపల్ కార్యాలయాన్ని తన హయాంలో నిర్మించాం. ప్రస్తుతం పట్టణానికి తాగునీరు అందించే పసుపులేరు వాగు నుంచి పైపులైన్ల ద్వారా ప్రజలకు తాగు నీటిని అందించాం. అప్పట్లో విద్యుత్ సక్రమంగా ఉండకపోవడంతో తరచూ పట్టణానికి తాగునీటి సమస్యలు ఎదురయ్యేవి. దీంతో ఏకంగా జనరేటర్‌ను ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీటి కష్టాలు రాకుండా చూశా అని వివరించారు.


