నీట మునిగి వ్యక్తి..
పాపన్నపేట(మెదక్): పక్షం రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి మంజీరా నదిలో మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని ఎంకెపల్లి శివారులో బుధవారం వెలుగు చూసినట్లు పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా చింతకుంటకు చెందిన అన్నాసాగర్ లక్ష్మయ్య (85) వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ నెల 13న ఇంట్లో నుంచి పొలం వద్దకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ మేరకు కుటుంబీకులు గ్రామ శివారులో వెతికినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో కుటుంబీకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా బుధవారం పాపన్నపేట మండల పరిధిలోని ఎంకెపల్లి శివారులోని మంజీరా నదిలో శవం కనిపించగా ,గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు లక్ష్మయ్యగా గుర్తించారు.


