రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
● మరో ముగ్గురికి గాయాలు
● ఆటోను ట్రాక్టర్ ఢీకొనడంతో ప్రమాదం
రామాయంపేట(మెదక్): మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట అటవీప్రాంతంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందగా, వారి కూతురు, కుమారుడితో పాటు మరో మహిళ తీవ్రంగా గాయపడింది. పోలీసుల కధనం మేరకు కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం బస్వాపూర్‌కు చెందిన ముద్రకోళ్ల బాలరాజు సంతల్లో తినుబండారాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం పాతూరులో జరిగే సంతకు ఆటోలో తన భార్య మంజుల, కుమారుడు అభి, కూతురు అక్షయతోపాటు మరో మహిళ పావనిని తీసుకొని వెళుతున్న క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. వారు ప్రయాణిస్తున్న ఆటోను ఎదురుగా అతి వేగంగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో మంజూల (32) సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన బాలరాజు (38)ను చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలిస్తుండగా, మార్గ మధ్యలో మృతి చెందాడు. కామారెడ్డిలో చికిత్స పొందుతున్న బాలుడు అభి పరిస్థితి విషమంగా ఉంది. అక్షయ, పావని చికిత్స పొందుతున్నారు.
ఉదారత చాటుకున్న ఏఎస్పీ
అదే సమయంలో రామాయంపేట వైపు వస్తున్న ఏఎస్పీ మహేందర్ తన వాహనాన్ని ఆపి సహాయక చర్యలు చేపట్టారు. దారిన వెళుతున్న వారితోపాటు తన సిబ్బందితో కలిసి గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించి తన ఉదారతను చాటుకున్నారు. రోడ్డుపై ట్రాఫిక్ జాం కాగా, స్వయంగా ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఎస్‌ఐ బాలరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బాలరాజు
మంజూల
రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి


