ఏడుపాయల ఈఓగా వీరేశం
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల నూతన ఈఓగా ఎం.వీరేశం బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇంత కాలం అదనపు బాధ్యతలు నిర్వహించిన అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ తన సొంత శాఖకు వెళ్లిపోయారు. మేడ్చల్ మల్కాజిగిరి శ్రీపద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయ గ్రేడ్–1 ఈఓ బాధ్యతలు నిర్వహిస్తున్న వీరేశంకు ఏడుపాయల ఎఫ్‌ఏసీ బాధ్యతలు అప్పచెబుతూ అడిషనల్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం మొదట ఏడుపాయల దుర్గమ్మకు పూజలు చేసిన అనంతరం, చంద్రశేఖర్ నుంచి బాధ్యతలు స్వీకరించారు.
గజ్వేల్‌రూరల్: మందుబాబులకు కోర్టు జరిమాన విధించింది. గజ్వేల్ ట్రాఫిక్ సీఐ మురళి వివరాల ప్రకారం... గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన డ్రంకెన్‌డ్రైవ్‌లో పలువురు వ్యక్తులు పట్టుబడ్డారు. వారిని బుధవారం గజ్వేల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ స్వాతి ఎదుట హాజరు పర్చగా ఐదుగురికి రూ. 50వేలు, ఓ వ్యక్తికి ఒకరోజు జైలుశిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన ఐదుగురికి రూ. 5వేల చొప్పున జరిమానా విధించారు.
కొమురవెల్లి(సిద్దిపేట): పోక్సో కేసులో యువకునికి జైలు శిక్ష, జరిమాన విధించినట్లు ఎస్‌ఐ మహేశ్ తెలిపారు. కొమురవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2024లో బాలికపై లైంగిక దాడి కేసులో ప్రధాన నిందితుడు శరిపుద్ధీన్ (19)పై కేసు నమోదైంది. పోలీసులు విచారణ చేసి సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు. బుధవారం సిద్దిపేట మొదటి అదనపు డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి జయప్రకాశ్ నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2లక్షల జరిమాన విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసులో నిందితునికి శిక్షపడేలా వ్యవహరించిన పోలీసులను కమిషనర్ రష్మీ పెరుమాళ్ అభినందించారు.
చేగుంట(తూప్రాన్): మండలంలోని వడియారం గ్రామంలో ఇంటి ముందు పార్కింగ్ చేసిన బైకు చోరీ జరిగిన సంఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామంలో నరేందర్‌నాయక్ తన గ్లామర్ బైక్‌ను ఇంటి ముందు పార్కింగ్ చేశాడు. మంగళవారం అర్ధరాత్రి ఓ దొంగ అదను చూసి గ్లామర్ బైకు ను నకిలీ తాళంతో స్టార్ట్ చేసుకొని ఉడాయించాడు. ఈ విషయం మొత్తం సమీప సీసీ టీవీలో రికార్డు అయింది. కేసు దర్యాప్తులో ఉంది.
శివ్వంపేట(నర్సాపూర్): అనాథాశ్రమం నుంచి మహిళ అదృశ్యమైంది. ఎస్సై మధుకర్‌రెడ్డి వివరాల ప్రకారం... మండల పరిధిలోని మగ్ధుంపూర్‌లోని బేతని అనాథాశ్రమంలో ఉంటున్న మతిస్థిమితం లేని బోనాల భవిత(32) మంగళవారం సాయంత్రం నుంచి కనిపించలేదు. దీంతో ఆశ్రమ నిర్వాహకులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. బుధవారం ఆశ్రమ ఇన్‌చార్జ్ కార్మెల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అక్కన్నపేట(హుస్నాబాద్): అప్పుల బాధ, మరో వైపు కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండలంలోని గౌరవెల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ చాతరాజు ప్రశాంత్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మారబోయిన కల్పన(33)భర్త భీమరాజుతో కలిసి పలు రకాల పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే వీరికి అప్పులు కాగా మరోవైపు కుటుంబ కలహాలు తోడయ్యాయి. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో కల్పన ఉరివేసుకుంది. మృతురాలికి 13ఏళ్ల లోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కల్పన తల్లి సరస్వతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
సిద్దిపేటరూరల్: యూడీఐడీ వికలాంగుల గుర్తింపు శిబిరానికి జిల్లాలోని అర్హులైన వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి జయదేవ్‌ఆర్యా ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 12, 26వ తేదీల్లో నడవలేని వారికి, 5వ తేదీన మానసిక స్థితి, 19వ తేదీన కంటిచూపు, చెవుడుతో బాధపడే వారికి పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మీసేవలో యూడీఐడీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకొని, నిర్దేశించిన తేదీ రోజున ఉదయం 9 గంటలకు హాజరు కావాలని సూచించారు. ధరఖాస్తు రసీదు, ఆధార్‌కార్డు, వైకల్యం ఫొటో, వైద్యుల రిపోర్టులు తీసుకురావాలన్నారు. దరఖాస్తు సంబంధిత మెసేజ్ వచ్చిన వారు మాత్రమే శిబిరానికి రావాలని తెలిపారు.
ఏడుపాయల ఈఓగా వీరేశం


