ఆశావహుల పైరవీలు
టికెట్ ఎవరికి ఇవ్వాలనే ఒత్తిడిలో నేతలు
షెడ్యూల్ రాకతో రాజకీయ వేడి ● ప్రధాన పార్టీల్లో తీవ్ర పోటీ
మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడంతో రాజకీయ వేడి మొదలైంది. కౌన్సిలర్ టికెట్లను దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల్లోని ఆశావహులు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆయా పార్టీల్లోని ముఖ్య నేతలను కలిసి తనకు టికెట్ కేటాయిస్తే గెలుపు పక్కా అంటూ నమ్మకంగా చెబుతున్నారు. బుధవారం నుంచి నామినేషన్లు స్వీకరించనుండటంతో సమయం లేదని అభ్యర్థులు పార్టీ నేతలను కలిసి వేడుకుంటున్నారు. ఒక్కో వార్డులో 5 నుంచి 8 మంది వరకు టికెట్లు ఆశిస్తున్నారు. దీంతో ఎవరికి ఇవ్వాలనే దానిపై ఆయా పార్టీల నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. పలువురు ఆశావహులు గాడ్ ఫాదర్‌తో ఫోన్లు చేయించి టికెట్ కేటాయించాలని రెకమండ్ చేయిస్తున్నారు.
– జహీరాబాద్:
జహీరాబాద్ మున్సిపాలిటీలో 37 వార్డులకు కాంగ్రెస్ పార్టీ నుంచి 130 మంది టికెట్లకు దరఖాస్తు చేసుకోగా, బీఆర్‌ఎస్‌లో 100కు పైగా దరఖాస్తు చేసుకున్నారు. కొత్తగా ఏర్పడిన కోహీర్ మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఆయా పార్టీల తరపున దరఖాస్తులు స్వీకరించారు. 16 వార్డులు ఉండగా అన్ని వార్డుల్లో నలుగురి చొప్పున ప్రధాన పార్టీల అభ్యర్థులు టికెట్లను ఆశిస్తున్నారు. సర్వే ఆధారంగా గెలిచే అవకాశం ఎవరికున్నదనే ప్రాతిపదికన టికెట్లను కేటాయించే అవకాశం ఉన్నట్లు ఆయా పార్టీల్లోని నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల్లో టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొనగా, బీజేపీ, ఎంఐఎం పార్టీల టికెట్లకు సైతం పలు వార్డుల్లో తీవ్ర పోటీ ఉంది. దీంతో ఆయా పార్టీల నేతలు సమావేశమై టికెట్లను ఎవరికివ్వాలనే దానిపై అధిష్టానవర్గానికి నివేదించనున్నట్లు సమాచారం. అభ్యర్థుల గుణగణాలు, ప్రజల్లో ఆదరణ, పార్టీకి అందిస్తున్న సేవలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని టికెట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల ఇన్‌చార్జీలే కీలకం
టికెట్ల కేటాయింపులో ఎన్నికల ఇన్‌చార్జీలే కీలకంగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఇన్‌చార్జిగా మంత్రి అజారుద్దీన్‌ను నియమించడంతో ఆయనే అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని టికెట్లను కేటాయించనున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ శ్రేణులు మంగళవారం హైదరాబాద్‌లో సమావేశమై చర్చించినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే... బీఆర్‌ఎస్ జహీరాబాద్ మున్సిపాలిటీకి ఎన్నికల ఇన్‌చార్జీగా దేవీ ప్రసాద్‌ను నియమించగా పక్షం రోజులుగా ఆయన జహీరాబాద్‌లోనే మకాం వేశారు. ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఎమ్మెల్యే మాణిక్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్‌లతో కలిసి అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీరంతా మంగళవారం హైదరాబాద్‌కు వెళ్లి పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైనట్లు తెలిసింది. బుధవారం జహీరాబాద్, కోహీర్ మున్సిపాలిటీలకు సంబంఽధించి ఖరారైన అభ్యర్థుల మొదటి లీస్టు వెల్లడించే అవకాశం ఉన్నట్లు పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. కాగా బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జీగా పైడి ఎల్లారెడ్డిని నియమించడంతో ఇప్పటికే ఆయన పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించి, ఎన్నికలకు సిద్ధం చేశారు. టికెట్లు కేటాయింపుపై ముఖ్య నేతలతో సమావేశమై ఖరారు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయం
ఆశావహుల పైరవీలు


