పట్ట పగలు చోరీ
న్యాల్‌కల్(జహీరాబాద్): పట్ట పగలు రెండిళ్లలో దొంగలు చొరబడి బంగారం, వెండితో పాటు నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మండల పరిధిలోని ఖలీల్‌పూర్ గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన జైపాల్‌రెడ్డి ఉదయం పొలానికి వెళ్లగా, భార్య లక్ష్మి రేజింతల్ గ్రామ శివారులో గల శ్రీసిద్దివినాయ ఆలయానికి వెళ్లింది. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాన్ని తీసి లోనికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న 3 తులాల బంగారం, 7తులాల వెండితో పాటు రూ.1.50లక్షలు ఎత్తుకెళ్లారు. అరగంట తర్వాత ఇంటికి వచ్చిన జైపాల్‌రెడ్డి ఇంటి తలుపులతో పాటు బీరువా తెరిచి ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అదే గ్రామానికి చెందిన సురప్ప ఇంటి తాళం పగుల గొట్టి దొంగలు రూ.2.05లక్షలు ఎత్తుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న జహీరాబాద్ డీఎస్పీ సైదానాయక్, రూరల్ సీఐ హన్మంతు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీం సిబ్బంది చోరీ జరిగిన ఇళ్లలో వివరాలు సేకరించారు.
జాలపల్లి గ్రామంలో..
మద్దూరు(హుస్నాబాద్): తాళం వేసిన ఇంట్లో దొంగలు చొరబడి నగదు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన జాలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మెతుకు శ్రీనివాస్‌రెడ్డి రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఉన్న తన కూతురు ఇంటికి వెళ్లాడు. మంగళవారం తిరిగి ఇంటికి వచ్చి చూసే సరికి తాళం పగులగొట్టి ఉంది. దీంతో లోపలికి వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి రూ.45వేల నగదు, 35 తులాల వెండి, పావు తులం బంగారం దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
బంగారం, వెండి,
రూ.3.55లక్షలు అపహరణ
పట్ట పగలు చోరీ


