ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి
సిద్దిపేటఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్ ఫౌండేషన్ కోర్సు ద్వారా 5 నెలల పాటు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు ఓయూ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ముడావత్ రవినాథ్ తెలిపారు. మంగళవారం స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీకాంత్‌తో కలిసి స్థానిక కళాశాలలో శిక్షణకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వెనకబడిన అభ్యర్థుల కోసం స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేసి శిక్షణను అందిస్తున్నదన్నారు. స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ గ్రూప్ –1, 2, 3, 4లతో పాటు ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఐ, కానిస్టేబుల్, ఎస్‌ఎస్‌సీ తదితర పోటీ పరీక్షలకు శిక్షణ అందుతుందన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని రూ. 3లక్షలలోపు ఆదాయం కలిగి ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తెలిపారు. ఈ నెల 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉందన్నారు. ఫిబ్రవరి 8న ప్రతిభా డిగ్రీ కళాశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించి, మెరిట్ ఆధారంగా 100 మందిని ఎంపిక చేస్తామన్నారు. ఎంపికై న వారికి 5 నెలల పాటు ఉచిత రెసిడెన్సియల్‌తో కూడిన శిక్షణ అందిస్తామని తెలిపారు. వివరాలకు 9182 220112లో సంప్రదించాలని సూచించారు.
సీసీ కెమెరాల పర్యవేక్షణలో నామినేషన్లు
రామాయంపేట(మెదక్): జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో నామినేషన్ల కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సారి నామినేషన్ల ప్రక్రియ సీసీ కెమెరాల పర్యవేక్షించనున్నట్లు వేక్షణలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్ అన్నారు. 28 నుంచి 30 వరకు మూడు రోజులు మాత్రమే నామినేషన్లు స్వీకరించనున్నారు. మంగళవారం పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి నామినేషన్లు వేసే కార్యాలయాలను సందర్శించారు. ఆయా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆర్వోలు, ఏఆర్వోలతో సమావేశం నిర్వహించారు. నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రకృతి వ్యవసాయం మేలు
కౌడిపల్లి(నర్సాపూర్): ప్రకృతి వ్యవసాయంతో నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహార పంటలు పండుతాయని, ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేయాలని డీఏఓ దేవ్‌కుమార్ తెలిపారు. మంగళవారం మండలంలోని తునికి కేవీకేలో ప్రకృతి వ్యవసాయంపై సీఆర్‌పీ (కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్)లకు ఐదురోజుల శిక్షణను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నేల ఆరోగ్యం బాగుంటేనే పంటలు బాగా పండుతాయన్నారు. నేల బాగు కోసం జీవామృతం, బీజామృతం, జీవన, పశువుల ఎరువులు వాడాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా టెక్నికల్ ఏడీఏ వినయ్ స్థానిక ఏడీఏ పుణ్యవతి, కేవీకే శాస్త్రవేత్తలు శంభాజీ దత్తాత్రేయ నల్కర్, రవికుమార్, ప్రతాప్‌రెడ్డి, భార్గవి, శ్రీనివాస్, ఏఓలు స్వప్న, రాజశేఖర్, బాల్‌రెడ్డి, కవిత, శ్వేత, ప్రవీణ్‌తోపాటు 30మంది సీఆర్‌పీలు పాల్గొన్నారు.
కేంద్రానివి
కార్మిక వ్యతిరేక విధానాలు
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు
పటాన్‌చెరు టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు ఆరోపించారు. ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెను పురస్కరించుకుని మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌కు సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ...ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పోరాడి సాధించుకున్న 8 గంటల పని దినాలను, రద్దుచేసి ప్రస్తుతం 12 గంటలకు పెంచడం అన్యాయమని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. నియోజకవర్గ పరిధిలోని జీహెచ్‌ఎంసీ మున్సిపల్ కార్మికుల కనీస వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెను కార్మికులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


